అవిశ్వాసం బాధే: కిరణ్ పైనా డిగ్గీ, సమైక్యమని మమత
న్యూఢిల్లీ: సొంత పార్టీ ప్రభుత్వంపై సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం న్యూఢిల్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు పార్లమెంటు సభ్యులతో తాము సంప్రదింపులు జరిపామన్నారు.
అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని కోరినట్లు చెప్పారు. వారు తమ నోటీసులను ఉపసంహరించుకంటారని తాము భావిస్తున్నామని తెలిపారు. తాను 12వ తేదిన హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పారు. జెసి దివాకర్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటున్నానన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలంగాణ ఏర్పాటుపై ప్రభావం చూపవన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పైన తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆయన పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లుగా తాము భావించడం లేదని చెప్పారు. కిరణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని డిగ్గీ చెప్పారు.

సమైక్యాంధ్రకు అనుకూలం: మమత
తాము సమైక్యాంధ్రకు అనుకూలమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాసానికి మద్దతిస్తామన్నారు. ప్రాంతీయ పార్టీల సమయం ఆసన్నమైందన్నారు. ప్రాంతీయ పార్టీల మధ్య మరింత సఖ్యత అవసరమన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, నిత్యావసర ధరలు పెరిగి వంటగదిలో మంటలు మండుతున్నాయన్నారు. నాలుగు రాష్ట్రాల్లో గెలుపు ఎవరి వ్యక్తిగతం కాదని, కాంగ్రెసు పార్టీ వ్యతిరేక పవనాలు అన్నారు.












Click it and Unblock the Notifications