డిగ్గీ హైదరాబాద్ రావద్దు, బెదిరించోద్దు: అశోక్ బాబు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ ఉండదని ఏపిఎన్జివోస్ అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రలో భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం విభజనపై మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. సొంత పార్టీ నేతలే పార్లమెంటులో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం దేశంలోనే తొలిసారని అశోక్ బాబు తెలిపారు.
సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోందని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నంత కాలం ఆందోళనలు జరుగుతాయని అశోక్ బాబు తెలిపారు. రాజీనామా చేయని ఎంపీలకు సాంఘిక బహిష్కరణ తప్పదని ఆయన హెచ్చరించారు. సోమవారం జరిగిన ఆందోళనలను చూసైనా కేంద్రం విభజనపై వెనక్కి తగ్గాలని అన్నారు. విభజనతో కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో నూకలు చెల్లినట్లేనని అశోక్ బాబు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ రాష్ట్రంలో పర్యటించడానికి వీల్లేదని అశోక్ బాబు హెచ్చరించారు. దిగ్విజయ్ ఓ చెడు శకునమని, ఆయన రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని, డిగ్గి రాజా గోబ్యాక్ అంటూ నిరసనలు చేపడతామని తెలిపారు. అసెంబ్లీలు విభజన బిల్లు వ్యవహారం తేలాకే రాష్ట్రంలో దిగ్విజయ్ పర్యటించాలని అన్నారు. దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చే నవంబర్ 12 నుంచి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చెప్పారు.
దిగ్విజయ్ రాష్ట్రంలో పర్యటించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేసి విభజన బిల్లుకు అనుకూలంగా వ్యవహరించేలా చేస్తే ఊరుకోబోమని అన్నారు. ప్రస్తుతానికి అసెంబ్లీ ముట్టడి వరకే ఉద్యమాన్ని కొనసాగించాలనుకున్నామని, దిగ్విజయ్ రాకతో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెలిపారు. అసెంబ్లీకి బిల్లు వచ్చిన సమయంలో దిగ్విజయ్ హైదరాబాద్‌కు రావడానికి వీళ్లేదని అన్నారు. రాజకీయ నాయకులు సమైక్యానికి కట్టుబడి ఉన్నామని మాట ఇచ్చారని, అదేవిధంగా వారు సమైక్యానికి కట్టుబడి విభజన బిల్లును వ్యతిరేకించాలని అన్నారు.
ఎంఐఎం పార్టీ కూడా విభజన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అశోక్ బాబు కోరారు. మంగళవారం సాయంత్రం గానీ, బుధవారం గానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి సమైక్యానికి మద్దతుగా ఉండాలని కోరతామని అన్నారు. ఇతర అన్ని పార్టీలను కూడా కలిసి విభజనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరతామని చెప్పారు. త్వరలో అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విభజన బిల్లుపై ముఖ్యమంత్రిని కూడా కలుస్తామని అశోక్ బాబు తెలిపారు.












Click it and Unblock the Notifications