టీడీపీ అభ్యర్థుల్లో తాజా మార్పులు - ఎవరెక్కడ..!!
ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారం పోటా పోటీగా సాగుతోంది. మూడు పార్టీల కూటమి అభ్యర్థులు..సీట్లు ప్రకటించారు. కానీ, కూటమి అభ్యర్థుల్లో మార్పులు కొన్ని తప్పవనే సంకేతాలు వస్తున్నాయి. తాజాగా టీడీపీలో చేరిన రఘురామరాజు సీటు గురించి స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో అనపర్తి, ఉండి సీట్లలో మార్పుల గురించి చర్చ జరుగుతోంది. టీడీపీలో మరి కొందరు అభ్యర్థుల మార్పు పైన అంచనాలు మొదలయ్యాయి.
టీడీపీ పొత్తులో భాగంగా 144 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. నర్సాపురం సీటు కోసం రఘురామరాజు కు దక్కేలా చంద్రబాబు ప్రయత్నాలు చేసారు. బీజేపీ నుంచి సానుకూలత రాలేదు. దీంతో, రఘురామరాజు టీడీపీలో చేరారు. ఉండి నియోజకవర్గం నుంచి రఘురామరాజు పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో, అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రామరాజు అనుచరులు నిరసనకు దిగారు. తనకు ఉండి సీటు గురించి చంద్రబాబు చెప్పలేదని రఘురామరాజు క్లారిటీ ఇచ్చారు. దీంతో, రఘురామరాజు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో అనపర్తి, ఉండి సీట్ల పైన చంద్రబాబు తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

అనపర్తి విషయంలోనూ క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామక్రిష్ణారెడ్డి తనకు సీటు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం కొనసాగిస్తున్నారు. అక్కడ బీజేపీ అబ్యర్ది తన ప్రచారం కొనసాగిస్తున్నారు. నల్లిమిల్లికి సీటు పైన బీజేపీ నుంచి క్లారిటీ రాలేదని తెలుస్తోంది. అక్కడ సీటు కోసం బీజేపీ, టీడీపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటితో పాటుగా తిరువూరు, పాతపట్నం, అనంతలో రెండు సీట్ల విషయంలో చంద్రబాబు సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. గుంటూరు, శ్రీకాకుళం, సత్యవేడు వంటి నియోజకవర్గాల్లోనూ మార్పుల గురించి చర్చ జరుగుతోంది. దీంతో, చంద్రబాబు తన పార్టీ అభ్యర్థుల విషయంలో చివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఎన్నికల సమయంలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications