వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి రాం గోపాల్ వర్మ - పవన్ టార్గెట్ గా..!!
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వైసీపీ నేత ఇంటికి వచ్చారు. వరుసగా చంద్రబాబు పై ప్రత్యక్షంగా.. పవన్ కల్యాణ్ పై పరోక్షంగా సీరియస్ కామెంట్స్ చేసిన ఆర్జీవి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే నివాసంలో ప్రత్యక్షం కావటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. రాం గోపాల్ వర్మ భోగి సాయంత్రం వేళ తూర్పు గోదావరి జిల్లాకు చేరుకున్నారు. కోడి పందాల్లో పాల్గొనేందుకు ఆర్జీవి వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అప్రమత్తం అయ్యారు జనసైనికులు ఆర్జీవీని అడ్డుకొనే అవకాశం ఉందని అంచనా వేసిన పోలీసులు ఆయన్ను తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. తన మిత్రుల ఆహ్వానం మేరకు కోడిపందాలలో పాల్గొనడానికి వచ్చానని ఆర్జీవి చెప్పుకొచ్చారు.
ఇక, ఈ ఉదయం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఇంటి ఆర్జీవి ప్రత్యక్షమయ్యారు. ఆయనతో కలిసి మంతనాలు చేసారు. తాజాగా ఆర్జీవి చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ నేతలతో పాటుగా మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఆర్జీవి పైన నాగబాబు ఆగ్రహం వ్యక్తి చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీని పైన ఆర్జీవి స్పందించేందుకు నిరాకరించారు. నాగబాబు ఏం మట్లాడారో తాను వినలేదని చెప్పారు. విన్న తరువాత నాగబాబు కామెంట్స్ పై స్పందిస్తానని చెప్పుకొచ్చారు. తనను ఫ్రెండ్స్ పిలిస్తే గోదావరి జిల్లాలకు వచ్చానని వివరించారు. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వర్సస్ జనసేన అన్నట్లుగా కాకినాడలో రాజకీయం కొనసాగుతోంది.

గతంలో పవన్ కల్యాణ్ లక్ష్యంగా ద్వారంపూడి సీరియస్ వ్యాఖ్యలు చేసారు. అదే తరహాలో ద్వారంపూడి పైన పవన్ రియాక్ట్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇద సమయంలో సీఎం జగన్ రాజకీయ జీవితం ఆధారంగా దర్శకుడు ఆర్జీవి వ్యూహం సినిమా సిద్దం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న కందుకూరు.. గుంటూరు సభల్లో తొక్కిసలాట..మరణాల పైన ఆర్జీవి తీవ్రంగా స్పందించారు. ఇక..చంద్రబాబు - పవన్ భేటీ తరువాత సామాజిక వర్గాల ప్రస్తావన తీసుకొస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేతో ఆర్జీవి భేటీ రాజకీయంగా ఆసక్తికి కారణమవుతోంది.












Click it and Unblock the Notifications