కోర్టుల్లో షాక్‌లు, అయినా జగన్ సాహసం -మే6 నుంచే విశాఖ రాజధానిగా పాలన? -నేడు ఓర్వకల్లు ఎయిర్ పోర్టు షురూ
ఒకటీ రెండూ కాదు, ఫిర్యాదుకు వెళ్లిన దాదాపు ప్రతి కేసులోనూ జగన్ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజధానితో ముడిపడి ఉన్న భూకుంభకోణంలో ఏకంగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ చేసిన ఫిర్యాదులు కూడా కొట్టుడుపోయాయి. జడ్జిలపై ఏపీ సీఎం ఫిర్యాదు తర్వాత హైకోర్టులో చిన్నచిన్న మార్పులు జరిగాయేతప్ప మూడు రాజధానుల వివాదాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. వచ్చే నెలలో జస్టిన్ ఎన్వీ రమణ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న దరిమిలా అమరావతి, మూడు రాజధానుల వ్యవహారం ఏ మలుపుతిరుగుతుందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. కాగా, కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నా రాజధానుల విషయంలో జగన్ సాహసోపేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆ క్రమంలో..
జగన్‌కు దిమ్మతిరిగే షాక్: జస్టిస్ ఎన్వీ రమణపై ఫిర్యాదును కొట్టేసిన సుప్రీంకోర్టు -సంచలన వ్యాఖ్యలు

హెచ్ఓడీలకు ఆదేశాలు..
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించే విషయంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. రెండు రోజుల కిందటే విశాఖ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన ఆయన తాజాగా వివిధ శాఖల అధిపతులు(హెచ్ఓడీల)ను విశాఖ పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుమారు 130 మంది హెచ్ఓడీలకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయని, సదరు అధికార యంత్రాంతం తమకు అనువైన ప్రాంతాలను ఎంచుకునేందుకు విశాఖలో తిష్టవేసినట్లుగా తెలుస్తోంది. ఒక్కో హెచ్ఓడీ పరిధిలో సుమారు 120 నుంచి 150 మంది వరకు విధులు నిర్వహిస్తుండగా, వాళ్లందరికీ అనుకూలమైన భవనసముదాయాలను విశాఖలో ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు సూచించారని తెలుస్తోంది. కొత్త రాజధానిలో ఎప్పటి నుంచి పాలన ప్రారంభించాలనేదానిపైనా ముహుర్తం ఖరారైనట్లు సమాచారం..
పాలేరు గడ్డపై పులివెందుల బిడ్డ -పోటీకి వైఎస్ షర్మిల సై -పార్టీలోకి మాజీ డీజీపీ! -ఖమ్మం సభ ఎలా?

మే 6 నుంచి విశాఖ కేంద్రంగా..
అమరావతి నుంచి హెచ్ఓడీలను విశాఖకు తరలించేందుకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 6వ తేదీ నుంచి అన్ని శాఖలు విశాఖ కేంద్రంగా పనిచేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సరిగ్గా మే 30 నాటికి జగన్ సీఎంగా ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మే 6 నుంచి విశాఖలో హెచ్ఓడీలను ప్రారంబిస్తే, 24 రోజుల్లోపు పరిపాలనను గాడిలోకి తీసుకొచ్చి, ముచ్చటగా మూడో ఏడాది నుంచే మూడు రాజధానుల నుంచి విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో..

త్వరలోనే సచివాలయం కూడా..
ఏపీలో పాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేస్తూ జగన్ సర్కారు నిర్ణయం తీసుకోవడం తెలసిందే. మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్ర నిర్ణయాలను సమర్థించింది. విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నా విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేసే విషయంలో జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. మే 6 నాటి హెచ్ఓడీలను తరలించాలని, ఆ తర్వాత సచివాలయాన్ని కూడా తీసుకెళతారని తెలిసింది. విశాఖను పూర్తి స్థాయి పాలనా రాజధానిగా కొనసాగించేందుకు మే 6ను మైలురాయిగా సర్కారు భావిస్తోంది. అయితే..

కోర్టుల్లో ఎదురుదెబ్బలు.. అయినా..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి ఆరునెలల్లోనే జగన్.. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని అమల్లోకి తేవడంతో గడిచిన ఏడాదిన్నరగా అదొక చల్లారని వివాదంగా సాగుతున్నది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అక్కడి రైతులు చేస్తోన్న నిరసనలు గురువారం నాటికి 464 రోజులకు చేరుతాయి. మూడు రాజధానుల వివాదంపై దాదాపు డజను కీలక కేసులు ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. జడ్జిలపై జగన్ ఫిర్యాదుకు ముందు రాజధాని వివాదాల విచారణ వేగంగా సాగినట్లు అనిపించినా, ఆ పరిణామం తర్వాత, అంటే, దాదాపు ఆరు నెలలుగా అమరావతి కేసులేవి తెరపైకి రాలేదు. ఏ రోజైనా వాటిపై విచారణలు మళ్లీ మొదలుకావొచ్చు..

రెండు రాజధానుల మధ్య విమానం
ఆంధ్రప్రదేశ్ కు న్యాయ రాజధానిగా జగన్ సర్కారు నిర్ణయించిన కర్నూలుకు సమీపంగా సరికొత్త ఓర్వకల్లు ఎయిర్ పోర్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ప్రారంభించనున్నారు. ఎయిర్ పోర్టు వద్ద జాతీయ జెండాతోపాటు వైఎస్సార్ విగ్రహాన్ని కూడా సీఎం ఆవిష్కరిస్తారు. న్యాయరాజధాని కర్నూలు నుంచి పాలనా రాజధాని విశాఖకు తొలి విమాన సర్వీస్ ప్రారంభం కానుంది. కాగా, కోర్టుల్లో చిక్కులు ఉన్నా మూడు రాజధానులపై జగన్ దూకుడు చర్చనీయాంశమైంది. వ్యక్తిగతంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్వవహారం కాబట్టి అమరావతి భూకుంభకోణం లేదా మూడు రాజధానుల వివాదాలపై కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేరుగా పరిశీలించే అవకాశాన్ని తీసుకోకపోవచ్చనే వాదన వినిపిస్తోంది.