చిక్కుల్లో చింతమనేని ప్రభాకర్...కోర్టులో చుక్కెదురు
పశ్చిమ గోదావరి: ఎపి ప్రభుత్వ విప్, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో చుక్కెదురైంది. భీమడోలు కోర్టు తనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను కొట్టివేయాలని ఏలూరు లోని జిల్లా కోర్టులో చింతమనేని వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది.
చింతమనేనికి విధించిన రెండేళ్ల శిక్షపై అప్పీల్ పిటిషన్ మాత్రం న్యాయస్థానం స్వీకరించింది. భీమడోలు కోర్టు విధి౦చిన శిక్షను రద్దుచేయడం లేదా తొలగి౦చడం అనే అభ్యర్థనలను మాత్రం అ౦గీకరి౦చేది లేదని కోర్టు స్పష్టం చేసినట్లు తెలిసింది. అలాగే కింది కోర్టు తీర్పు పై స్టే ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. దీంతో తనకు జిల్లా కోర్టులోనూ ఊరట లభించకపోవడంతో చింతమనేని హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నారు.

2011లో అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్‌పై దౌర్జన్యం చేసిన కేసులో మూడు సెక్షన్ల కింద అభియోగాలు రుజువైనందున భీమడోలు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి కె. దీప దైవకృప రెండేళ్ల జైలుశిక్ష, రూ.2500 జరిమానా విధిస్తూ ఫిబ్రవరి 14న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. తదనంతరం తీర్పును తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ చింతమనేని ప్రభాకర్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించినా ఊరట లభించలేదు.












Click it and Unblock the Notifications