జిల్లాల పర్యటన.. వైఎస్ షర్మిల సామర్ధ్యానికి అసలు పరీక్ష.. ఎందుకంటే!!
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధ్యతలు చేపట్టిన తొలి నాటి నుండే తనదైన దూకుడును కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు టిడిపి, బిజెపి లను సైతం తూర్పారబడుతున్నారు.
ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను యాక్టివ్ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్న వైఎస్ షర్మిల త్వరలో జిల్లాల వారీగా పర్యటనలు మొదలు పెట్టనున్నారు. ఇక ఈ పర్యటనలను సక్సెస్ చేయడం షర్మిల సామర్థ్యానికి పెద్ద పరీక్ష అని చెప్పాలి. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు యాక్టివ్ గా పనిచేయని సీనియర్ నాయకులను తిరిగి ట్రాక్ ఎక్కించడానికి వైయస్ షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నారు.

అందులో భాగంగా జిల్లాల వారీగా పర్యటనలు ఫిక్స్ చేసుకున్న షర్మిల కాంగ్రెస్ నేతలందరూ ఈ పర్యటనలలో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు జరుగుతున్న రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు. వైసిపి, టిడిపిలను షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ బలంగా ఢీ కొట్టగలదా అన్న అంచనాలు వేస్తున్నారు.ఇక కొందరైతే మళ్లీ పార్టీ రాజకీయాలని ముందుకు వస్తే డబ్బులు ఖర్చు తప్ప జరిగే ప్రయోజనం ఏమీ లేదని భావిస్తున్నారు.
ఇక ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు భిన్న అభిప్రాయాలతో రాజకీయాలు పట్టనట్టు ఉంటున్న క్రమంలో, వారందరిని యాక్టివ్ చేయడానికి, తను ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి వెనుక ఉన్న కారణాలను, ఏపీలో అందరూ కష్టపడితే ఎన్నికలలో ఎటువంటి ఫలితాలు సాధించవచ్చు అన్న విషయాలను చెప్పటానికి వైఎస్ షర్మిల జిల్లాల వారీగా పర్యటనల ద్వారా ఫోకస్ పెట్టనున్నారు.
చాలా కాలం నుంచి నిద్రావస్థలో ఉన్న కాంగ్రెస్ నాయకులను మళ్లీ రంగంలోకి దిగేలా చేయడం, ఇదే సమయంలో ప్రతిపక్షాల మాటల దాడులను తిప్పి కొట్టడం, ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం వైయస్ షర్మిల కు కత్తి మీద సామే. మరి ఈ పరీక్షలో షర్మిల ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications