Diwali 2021: వెలుగుల పండుగ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్ లతో పాటు చంద్రబాబు
దేశ వ్యాప్తంగా ప్రజలందరూ అత్యంత ఘనంగా జరుపుకునే దీపావళి పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అమావాస్య చీకట్లను చీల్చుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని రోజు జరుపుకునే పండుగ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అటువంటి దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటున్న శుభ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్లో ఆర్మీ జవాన్ల తో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. ఒకపక్క జమ్ము కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుంటే సెర్చ్ ఆపరేషన్లు, ఎన్ కౌంటర్ లతో జమ్మూకాశ్మీర్ దద్దరిల్లుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ వెళుతున్నారు. జమ్మూ & కాశ్మీర్‌లోని రాజౌరిలోని నౌషేరా సెక్టార్‌లోని ఫార్వర్డ్ ఏరియా నవంబర్ 4, దీపావళి పర్వదినం నాడు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి వేడుకలు సైనికులతో కలిసి చేసుకోవడానికి వెళ్తున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. పరమపవిత్రమైన దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ తన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న నరేంద్ర మోడీ దీపావళి కాంతులు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంపదలను, సౌభాగ్యాన్ని తీసుకురావాలని తాను కోరుకుంటున్నట్లు గా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి తన దీపావళి శుభాకాంక్షలు అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.
దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నిమ్పాలన్న సీఎం జగన్
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి జీవితాల్లో దీపావళి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. చెడుపై మంచి సాధించిన విజయంగా చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా సీఎం జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు .దీపావళి దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటా ఆనందాల సిరులు కురిపించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఆకాంక్షను తెలియజేశారు.
అందరి ఇంట ఆనంద కాంతులు నిండాలన్న మాజీ సీఎం చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి మీ ఇంట నిత్య ఆనంద కాంతులని నింపాలని కోరుకుంటున్నా అని పేర్కొన్న చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి దీపాన్ని వెలిగించినట్టే జీవితంలో కష్టమనే చీకటిని పోగొట్టడానికి ధైర్యమనే దీపాన్ని, కృషి అనే నూనెతో వెలిగించాలని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని చెడు అనే చీకటిని పోగొట్టడానికి మంచి అనే దీపాన్ని ఒకరికొకరు వెలిగించుకుంటూ పోవాలి. ఇదే దీపావళి సారాంశం అంటూ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.దీపావళి పండుగ శుభవేళ... మీ ఇంట ఆనంద కాంతులు వెల్లివిరియాలని, మీ కుటుంబానికి సకల శుభాలు సమకూరాలని కోరుకుంటూ... మీ ఇంటిల్లిపాదికీ పండుగ శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు నాయుడు తన సందేశాన్ని ఇచ్చారు.












Click it and Unblock the Notifications