పవన్ చుట్టూ పాలిట్రిక్స్: టిలో కొత్త ట్విస్ట్, తేల్చేసిన కిరణ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం నేపథ్యంలో కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాలు ఎంతో కొంత ఆయన చుట్టు తిరుగుతున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెసు పార్టీకి పెద్ద ఎసెట్. పవన్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగడంతో చిరుకు చెక్ చెప్పేందుకు పవర్ స్టార్‌కు గాలం వేసే పనిలో పార్టీలు పడ్డాయి.
పవన్‌కు ఉన్న ఇమేజ్‌కు తోడు, చిరు సోదరుడు అయినందున ఆయనను ధీటుగా ఎదుర్కొనేందుకే పలు పార్టీలు తమ్ముడి వైపు చూస్తున్నాయంటున్నారు. టిడిపికి మద్దతిస్తారని, బిజెపిలోకి వెళ్తారని, లోక్‌సత్తా లేదా ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి)లో చేరుతారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే, పవన్ ఏం చేస్తారనేది ఆదివారం తెలియనుంది. ఆ రోజు ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడనున్నారట.

పవన్ రాజకీయ ఆరంగేట్రం ఊహాగానాల నేపథ్యంలో పలువురు నేతలు ఆయన కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మాజీ ప్రజారాజ్యం, యువరాజ్యం నాయకులు ఆయనతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని అంటున్నారు. ఓ వైపు చిరుకు, మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలకు పవన్ ద్వారా చెక్ చెప్పేందుకు కొన్ని పార్టీలు చూస్తున్నాయని చెబుతున్నారు.
తెలంగాణలో కొత్త కొలికి
తెలంగాణ రాష్ట్ర సాధన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో కొత్త వాదన తెర పైకి వచ్చింది. దీనిని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత డికె అరుణ తెర పైకి తీసుకు వచ్చారు. ఉత్తర తెలంగాణ నేతలు దక్షిణ తెలంగాణను పాలించాలని చూస్తే సహించేది లేదని ఆమె కొత్త వాదన తీసుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసేందుకు విముఖత చూపిన నేపథ్యంలో ఆయనను ధీటుగా ఎదుర్కొని, పట్టు సాధించే ఉద్దేశ్యంలో భాగంగానే డికె అరుణ ఈ వాదన తీసుకు వచ్చారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బిజెపిలో కొత్త ఊపు
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతంలో భారతీయ జనతా పార్టీలో కొత్త ఊపు కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటులో తమ పార్టీ పాత్ర కీలకమని ప్రజలకు వివరిస్తోంది. కెసిఆర్, కాంగ్రెసులు ఏం చేశారో చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన ఉత్సాహం తెలంగాణ బిజెపిలో కనిపిస్తుండగా, సీమాంధ్రలో పలువురు ముఖ్య నేతల చేరిక ఆ పార్టీకి మరింత ఆనందం ఇస్తోంది. పురంధేశ్వరి వంటి నేతలు బిజెపిలో చేరనుండటం సీమాంధ్రలో ఆ పార్టీకి కొత్త ఊపునిచ్చిందని చెబుతున్నారు.
ఉత్కంఠకు తెర దించిన కిరణ్
కొత్త పార్టీపై మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్కంఠకు తెర దించారు. తాను ప్రపంచంలోని తెలుగు వారి కోసం పార్టీ పెడుతున్నానని, ఈ నెల 12న రాజమండ్రిలో తొలి సభ ఉంటుందని, అప్పుడు పార్టీ విధి విధానాలు చెబుతామన్నారు. అయితే, తెలుగు వారి గుండె చప్పుడే తమ విధానాలు అని ఆయన చెప్పడం గమనార్హం. తెలంగాణ, సీమాంధ్రలో పోటీ చేస్తారా అంటే.. ఆంధ్రప్రదేశ్‌లో అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications