నిన్న విజయ్, ఇవాళ డీకే శివకుమార్- చంద్రబాబు అడగ్గానే కాదనకుండా..!
ఏపీని వరుసగా తుఫాన్ లు వెంటాడుతున్నాయి. మొన్న అర్నబ్ తుఫాన్ వల్ల తలిగిన దెబ్బలకు కోలుకోకముందే.. ఇప్పుడు మురసు తుపాన్ కలవరపెడుతోంది. రేపు మురసు తీరం దాటిన తర్వాత ఏపీలో జరిగే విధ్వంసాన్ని ఊహించుకుని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అన్నింటికీ మించి ఈ తుఫాన్ల వల్ల విద్యుత్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వాటి పునరుద్దరణకు ఏపీ దగ్గర అవసరమైన సిబ్బంది, పరికరాలు లేవు. దీంతో పొరుగు రాష్ట్రాల సాయం కోరుతోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తులకు పొరుగు రాష్ట్రాల సీఎంలు వరుసగా స్పందిస్తున్నారు.
ఏపీలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్ధల పునరుద్ధరణకు నిన్న తమిళనాడు సీఎం విజయ్ ను చంద్రబాబు సాయం కోరగా.. ఆయన వెంటనే స్పందించి హామీ ఇచ్చారు. ఇవాళ కర్నాటక సీఎం డీకే శివకుమార్ ను (DK Shivakumar) సైతం చంద్రబాబు సాయం కోరారు. దీంతో ఆయన కూడా స్పందించి ఏపీకి అండగా నిలుస్తామని ప్రకటించారు. ఈ మేరకు డీకే శివకుమార్ ఎక్స్ లో ఓ ట్వీట్ కూడా చేశారు. ఆర్నబ్ తుఫాను వల్ల కలిగిన విధ్వంసంతో ఆంధ్రప్రదేశ్ పోరాడుతున్న తరుణంలో, ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుతో మాట్లాడి, కర్ణాటక పూర్తి మద్దతు ఇస్తుందని ఆయనకు హామీ ఇచ్చానన్నారు.

ఆర్నబ్ తుఫాను వల్ల 15,000కు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో, విద్యుత్ మౌలిక సదుపాయాల పునరుద్ధరణ అత్యంత కీలకమని, ఈ ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహాయాన్ని కోరిందన్నారు. మా ఇంధన శాఖ ఈ సహాయాన్ని సమన్వయం చేస్తోందన్నారు. ఇంధన శాఖ మంత్రి కె.జె.జార్జ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ మద్దతులో భాగంగా, తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి , విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించడానికి వీలుగా, కర్ణాటక 500 మంది నైపుణ్యం కలిగిన పవర్‌మెన్‌లను, అవసరమైన పరికరాలతో పాటుగా పంపిస్తోందన్నారు. పునరుద్ధరణ ప్రదేశాలలో మానవ వనరులు, పరికరాల సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడానికి తమ బృందాలు ఆంధ్రప్రదేశ్ అధికారులతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తాయని డీకే శివకుమార్ తెలిపారు. రాబోయే మురసు తుఫాను ఒక కొత్త సవాలును విసురుతోందని, రాబోయే రెండు రోజులలో తాము పరిస్థితిని, దాని ప్రభావాన్ని అంచనా వేస్తూనే, సాధ్యమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు. కష్ట సమయాల్లో, సంఘీభావం కార్యాచరణగా మారాలన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భుజం భుజం కలిపి నిలుస్తుందని, తాము సాధ్యమైన అన్ని విధాలా మద్దతును అందిస్తామని డీకే వెల్లడించారు.














Click it and Unblock the Notifications
