మహిళా బూత్ ఏజెంట్ల చీరలులాగి, జుట్టు పట్టుకుని కొట్టారు.. మాజీమంత్రి విడదల రజిని ఆగ్రహం!
చిలకలూరిపేటలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం రిగ్గింగ్ కు పాల్పడిందని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేసిందని మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు కర్రలు, రాడ్లతో పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే పోలీసులు వారికి అండగా నిలిచారని మండిపడ్డారు.
నాలుగైదు వార్డులు మినహా మిగిలిన ప్రాంతాల్లో బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, ఓట్ల రీసైక్లింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగైదు వార్డులు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్, ఓట్ల రీసైక్లింగ్‌కు పాల్పడ్డారు. గుర్రాల చావిడిలో ముస్లిం మైనారిటీ మహిళా బూత్ ఏజెంట్లపై దాడులు చేసి, చీరలు లాగి, జుట్టు పట్టుకుని కొట్టారని మండిపడ్డారు.

ఎస్సీ సంజీవనగర్‌లో ఎస్సీ మహిళలపై దాడులు చేశారు. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఆర్యవైశ్యులను ఊర్లో లేకుండా చేస్తామని బెదిరించారని విడదల రజిని ఆరోపించారు. ఎస్టీ, కాపు సామాజికవర్గాల నాయకులకు ఎమ్మెల్యే స్వయంగా ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఎమ్మెల్యే తన అనుచరుడితో ఓటు వేయాలని మాట్లాడిన వీడియోలు బయటపడ్డాయని, ఇక ఈ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్, ఓట్ల రీసైక్లింగ్‌కు ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? అని ప్రశ్నించారు.
నామినేషన్ల దగ్గర నుంచి పోలింగ్ వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జ్‌లను హౌస్ అరెస్టులు చేసి, అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్నారు. బీఫారాలు చింపేయడం, బెదిరించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేయడం, చివరి రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు కార్యాలయాలు తెరిచి ఉంచి ఉపసంహరణల తతంగం నడపడం వంటి దారుణాలకు పాల్పడ్డారన్నారు.
పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన మా బూత్ ఏజెంట్లను కాలర్లు పట్టుకుని బయటకు లాగేశారని ఆరోపించారు. దాడులు చేస్తున్న టీడీపీ గూండాలను వదిలేసి, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని పోలీసుల తీరును ఆక్షేపించారు. అక్రమాలను చిత్రీకరించేందుకు వెళ్లిన విలేకరులపై దాడులు చేసి, ఫోన్లు పగలగొట్టి మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేశారన్నారు.
ఈ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఆధారాలతో ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశాం, బాధ్యులైన ఎమ్మెల్యే అనుచరులు, అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకుని, అక్రమాలు జరిగిన చోట రీపోలింగ్ నిర్వహించాలని మాజీమంత్రి విడదల రజిని డిమాండ్ చేశారు. ఎన్ని దాడులు, బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ వెనక్కి తగ్గదన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేసి ప్రజల తరఫున పోరాడుతుందని మాజీ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
