దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్, తెలంగాణలో అతి భారీ వర్షాలు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మురసు తీవ్ర తుపాను మరింత బలపడుతోంది. మురాసు తుపాను ఎఫెక్ట్ ఏపీలోని కోస్తాంధ్రతో పాటు తెలంగాణ పలు జిల్లాలపై పెను ప్రభావం చూపుతోంది. ఇది చెన్నైకి సుమారు 630 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా మారి తుపానుగా బలపడింది. మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మురాసు ఎఫెక్ట్ తెలంగాణలో పలు జిల్లాలకు ఉంది. దీంతో ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
మురసు తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, తిరుమల, నెల్లూరు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. తెలంగాణలోని నల్గొండ, నాగర్కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సూర్యాపేట, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో రానున్న రెండు నుంచి మూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ తాజా అలెర్ట్స్
అదే విధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మురసు తుపాను ప్రభావంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలతో పాటు నల్గొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 3, 4, 5 తేదీల్లో ఘాట్ రోడ్లలో ప్రయాణాలను పూర్తిగా మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, కొండలపై నుంచి రాళ్లు దొర్లిపడే ప్రమాదం ఉందని తెలిపారు. అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. మురుసు తుపాను ప్రభావం నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
