వైయస్ అవినీతిని చూల్లేదు: కిరణ్‌పై డొక్కా తీవ్ర ఆరోపణ
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తొలిసారిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ గురువారం తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. కిరణ్ పార్టీ పెట్టాలనుకుంటే ఎప్పుడో పెట్టారని, అవినీతి ఆరోపణలను తప్పించుకునేందుకే ఇప్పుడు పెట్టాలని భావిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ పెట్టాలనుకుంటే ఊపుమీద ఉన్నప్పుడే పెట్టే వారని, ఇప్పుడు పెట్టాలనుకోవడం వెనుక అవినీతి ఆరోపణలు తప్పించుకునేందుకే అన్నారు.
గతంలో తాను కిరణ్ పార్టీ విషయంలో రెండు ప్లాన్‌లు చెప్పానని, ఆయన వాటికి ట్విస్ట్ ఇచ్చారన్నారు. కిరణ్ అవినీతి ఆరోపణల పైన విచారణ జరిపించాలని తాను గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. గత ఆరు నెలలుగా వేల కోట్లు చేతులు మారాయని, పెట్రో డీలర్ల సమ్మె, బదలీలపై విచారణ జరపాలని అందులో కోరినట్లు చెప్పారు. తాను డబ్బులు ఎలా సంపాదించారని సిబిఐ ఎంక్వయిరీ చేస్తుందని కిరణ్ పార్టీ పెట్టబోతున్నారన్నారు.

అప్పుడు విచారణకు ఆదేశిస్తే తాను రాజకీయ పార్టీని స్థాపించినందు వల్లనే తనపై విచారణ పేరిట వేధింపులు జరుగుతున్నాయని కిరణ్ చెప్పేందుకు ఆస్కారం ఉంటుందని, అందుకే ఆయన పార్టీపై ఆలోచన చేస్తున్నారని చెప్పారు. తన పైన ఏవైనా అవినీతి ఆరోపణలు ఉంటే ప్రూవ్ చేయాలని డొక్కా సవాల్ చేశారు. కిరణ్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. కిరణ్ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారన్నారు.
ఆరు నెలలుగా కిరణ్ రెండు చేతులతో సంతకాలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయన్నారు. ఐఏఎస్, ఐపిఎస్‌ల బదలీకు కూడా డబ్బులు వసూలు చేసినట్లుగా చెబుతున్నారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతిని తాను చూడలేదని, ఆయనకు ప్రజల మద్దతు ఉందని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డికి అది కూడా లేదన్నారు. కిరణ్ ఆరు నెలల్లో 5వేల కోట్ల నుండి 10వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా ఆరోపణలు ఉన్నాయన్నారు.
అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కొత్త పార్టీ అంటున్నారన్నారు. కిరణ్ తన పైన ఉన్న అవినీతి ఆరోపణలు తప్పని నిరూపించుకోవాలని సూచించారు. అవినీతి ఆరోపణల నుండి తప్పించుకునేందుకే పార్టీ పెట్టాలనుకుంటున్నారేమోనని అయితే, ఇప్పటికి తనకు నమ్మకముందని, ఆయన పార్టీ పెట్టరని, సాయంత్రం ప్రెస్ మీట్ మాత్రమే పెడతారన్నారు. పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ పైన వచ్చిన అవినీతి ఆరోపణల పైన విలేకరులు ప్రశ్నిస్తే సమాధానం దాట వేశారు.
తాను బొత్స పైన వచ్చిన అవినీతి ఆరోపణలను చూడలేదన్నారు. కిరణ్ ఉండగా బ్యాక్ ఆఫీసులో లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని, ఆయన తమ్ముడు చక్రం తిప్పారని చెబుతున్నారని అన్నారు. కాగా గవర్నర్‌కు రాసిన లేఖలో డొక్కా.. కిరణ్, తన పైన విచారణ జరిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications