డాలర్ శేషాద్రి కన్నుమూత -చివరి నిమిషం వరకూ శ్రీవారి సేవలోనే..!!
తిరుమల శ్రీవారి ఆలయం లో జరిగే ఏ వేడుకల్లో..ఉత్సవాల్లో అయినా ఖచ్చితంగా ఉండే వ్యక్తి డాలర్ శేషాద్రి. తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ గా వ్యవహరిస్తున్న డాలర్ శేషాద్రి గుండెపోటుతో సోమవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే ఆయన కన్నుమూశారని సన్నిహితులు వెల్లడించారు. డాలర్ శేషాద్రి విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లగా ఈ ఘటన జరిగింది.

శ్రీవారి సేవలో నాలుగు దశాబ్దాలకు పైగా
1978వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో డాలర్ శేషాద్రి పాల్గొంటున్నారు. 2007లో రిటైర్మెంట్ అయినా....శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఓఎస్‌డీగా కొనసాగుతున్నారు. మరణించే చివరి క్షణం వరకు శ్రీవారి సేవలో ఆయన తరించారు.
కాగా డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీవ్రనష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు టీటీడీలో భర్తీకాదని అభిప్రాయపడ్డారు. గతంలోనే ఆయనకు రెండు సార్లు గుండె పోటు వచ్చింది. చికిత్స తీసుకోవటంతో తిరిగి కోలుకున్నారు.

ఆయన సేవలు గుర్తించి పొడిగింపు
జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆయన సేవలను మరోసారి పొడిగించారు. తిరుమల లోనే కాదు బయట ఎక్కడ శ్రీవారి ఉత్సవాలు...శ్రీవారి కళ్యాణం టీటీడీ నిర్వహించినా..అందులో డాలర్ శేషాద్రి ఉంటారు. తిరుమలకు ఎంతో మంది ప్రముఖులకు ఆయన స్వామి వారి ఆశీర్వచనాలు.. ప్రసాదాలు తన చేతులతో అందించేవారు.
రాష్ట్రపతి..ప్రధాని..రాజకీయ..పారిశ్రామిక ప్రముఖలకు సుపరిచితుడుగా మారారు. శ్రీవారి సేవల పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా..తిరుమల క్షేత్రంలో డాలర్ శేషాద్రి ప్రత్యేక గుర్తింపు పొందారు.
Recommended Video

శ్రీవారి సేవ కోసం విశాఖ వచ్చి..అక్కడే
చివరి నిమిషంలోనూ శ్రీవారి సేవలోనే ఆయన గడిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన శ్రీవారి సేవలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం సింహాచలం వరాహాలక్ష్మీ నృసింహ్మస్వామి వారిని దర్శించుకున్న శేషాద్రి...ఈ రోజు ఆర్కేబీచ్ లో టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కోసం వచ్చారు. అక్కడే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.












Click it and Unblock the Notifications