కిరణ్, జగన్‌లని ఏకిపారేసిన కెటిఆర్, నమ్మొద్దని యాష్కీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే హైదరాబాదులో పోటీ చేసే గెలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు శనివారం అన్నారు. కిరణ్ పనికిమాలిన పసలేని పిడివాదం చేస్తూ సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శాసనసభలో తెలంగాణ ముసాయిదా బిల్లును ఓడిస్తామని, ఓడిపోయిన ముసాయిదా బిల్లును పార్లమెంటు ఆమోదించదంటూ కిరణ్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ముసాయిదా బిల్లుకు ఓటింగ్ ఉండదని, అయినప్పటికీ నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని, సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారన్నారు.

సీల్డ్ కవర్ సిఎం రాష్ట్ర విభజన దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని చెబుతున్నారని, వీలేతే ప్రపంచ రాజకీయాలపై, అంగారకుడిపై కూడా ప్రభావం ఉంటుందని చెబుతారన్నారు. కెసిఆర్ అడిగారని తెలంగాణ ఇస్తారా అని ప్రశ్నించడం సరికాదన్నారు. నాలుగున్నర కోట్ల మంతి ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని, వెయ్యి మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు.
హైదరాబాదులో సద్భావన సదస్సులు పెడతామని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మలు గుడ్డిగా తెలంగాణను వ్యతిరేకిస్తున్నారన్నారు. జగన్ చేయాల్సిన దొంగ పనులన్నీ చేసి ఇప్పుడు ఆర్టికల్ 3ని సవరించాలంటూ దేశాటన చేస్తున్నారని, ఇది విడ్డూరమన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం నేతల మాటలు విని సీమాంధ్ర ప్రజలు మోసపోవద్దని నిజామాబాద్ ఎంపి మధయాష్కి సూచించారు. తెలంగాణ నేతలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని హితవు పలికారు. విలీనం అంశాన్ని తెరాసకే వదిలేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో సిఎం పదవి చిన్న స్థానం అని... సిఎంకు తెలంగాణను ఆపే శక్తి లేదని మధుయాష్కి వెల్లడించారు.












Click it and Unblock the Notifications