సిద్ధమౌతున్న పవన్, 'జగన్' సాక్షికి సమాధానమా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల పైన దృష్టి సారించనున్నారు! పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చాక పవన్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీకి గుర్తింపు రాగానే పవన్ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అంశానికి సంబంధించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి జోరుగా ప్రచారం చేశారు. ప్రచారంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల పైన నిప్పులు చెరిగిన పవన్.. టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చాక ప్రజావ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిని కూడా ప్రశ్నిస్తానని చెప్పారు.

బీజేపీ, టీడీపీలను కూడా ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ వైపు ఇప్పుడు పలువురు దృష్టి సారించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రెండు టీవీ చానళ్ల ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ జర్నలిస్టు సంఘాలు హైదరాబాదులో నిరసన ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీకి మద్దతిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారట. దీంతో ప్రశ్నిస్తానన్న పవన్ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు జగన్‌కు చెందిన సాక్షి దీనిని ప్రస్తావించింది.
సామాన్యులు కూడా దీని పైన మాట్లాడుకుంటున్నారంటున్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబు పాలన పైన పవన్ కళ్యాణ్ ప్రశ్నించరా అని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని పైన కూడా పరోక్షంగా జనసేన స్పందించినట్లుగా కనిపిస్తోంది.
ఈసీ గుర్తింపు వచ్చాక పవన్ కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన చెప్పడం ద్వారా సాక్షికి సమాధానం చెప్పినట్లుగా పలువురు భావిస్తున్నారు. అలాగే జనసేన పేరును కొందరు సోషల్ మీడియాలో వాడుకొని నిధులు వసూలు చేస్తున్నారని, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జనసేన ఆ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications