అంత్యక్రియలకు ఎవరూ రావొద్దు... సబ్బం హరి కుమారుడి విజ్ఞప్తి...
మాజీ ఎంపీ సబ్బం హరి సోమవారం(మే 3) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తాజాగా సబ్బం హరి కుమారుడు మాట్లాడుతూ... చికిత్స తర్వాత తన తండ్రికి కోవిడ్ నెగటివ్‌గా తేలిందన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల మధ్యాహ్నం 1.22గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలిపారు.
మంగళవారం(మే 4) ఉదయం 9గంటల తర్వాత సబ్బం హరి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా ఉన్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. తన తండ్రి ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు తన తండ్రి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన తండ్రి అంత్యక్రియలకు అభిమానులు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

సబ్బం హరి మృతిపై హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. విశాఖ అభివృద్దికి ఆయన ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. హరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అంతకుముందు,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సబ్బం హరి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీగా,విశాఖ మేయర్‌గా ఆయన చేసిన సేవలు మరువలేనివి అన్నారు. ఆయన కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఆయన త్వరగా కోలుకోవాలని ఆశించామన్నారు. కానీ ఇంతలోనే మరణవార్త వినాల్సి రావడం దురదృష్టకరమన్నారు.
సబ్బం హరి స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని చిట్టివలస గ్రామం. ఆయనకు ఇద్దరు కుమార్తెలు,కుమారుడు ఉన్నారు. 1995లో హరి విశాఖ మేయర్‌గా పనిచేశారు. 2009లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీలో చేరారు.












Click it and Unblock the Notifications