TTD: తిరుమలలో మే నెలలో జరిగే విశేష ఉత్సవాలు.. మిస్ కాకండి!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతీ నెలలో విశేష పూజలు కొనసాగుతాయి. స్వామివారికి జరిగే పూజలలో ఏ నెలకు ఆ నెల ప్రత్యేకమైనది. ప్రస్తుతం ఎండాకాలం కావడంతో పిల్లలు, పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ఉండడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఇక ఎండాకాలం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు.
మే నెలలో తిరుమల శ్రీవారి విశేష వేడుకలు
ఇదిలా ఉంటే మే నెలలో స్వామివారికి జరిగే విశేష వేడుకలు, తిరుమల శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు వెల్లడించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాల విషయానికి వస్తే మే 1న అనంతాళ్వార్ ఉత్సవం నిర్వహించనున్నట్టు పేర్కొంది. మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతిని నిర్వహించనున్నారు.

ఘనంగా పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు
6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభమవుతాయని, మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి అవుతుందని టిటిడి తెలిపింది. అలాగే మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర జరగనుంది. మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి నిర్వహించనున్నారు. అలాగే మే నెలలో 12వ తేదీ కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ నిర్వహించనున్నారు.
వేసవి సెలవుల రద్దీతో టీటీడీ కీలక నిర్ణయాలు
మే నెలలో 14వ తేదీ పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా మే 22న హనుమజ్జయంతి, మే 31న నమ్మాళ్వార్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టిటిడి వెల్లడించింది. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఇలా
ఇదిలా ఉంటే నిన్న తిరుమలలో స్వామివారిని 78117 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 3604 మంది తలనీలాలు ఇవ్వగా. 3.53 కోట్ల రూపాయల హుండీ ఆదాయం లభించింది. ఇక సర్వదర్శనం కోసం సుమారు 6 గంటల నుంచి 7 గంటల సమయం పడుతుంది.












Click it and Unblock the Notifications