ప్రత్యేక హోదాపై రాజ్యసభలో పోరు-లోక్ సభలో మౌనం- వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడేనా ?
తమకు 25 మంది ఎంపీల్ని ఇస్తే పార్లమెంటులో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇఛ్చిన వైసీపీ రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇంకా ఆ హామీని నిలబెట్టుకోలేకపోయింది. దీంతో వైసీపీపై అనూహ్యంగా ఒ త్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రంపై పోరాటం పేరుతో పార్లమెంటులో వైసీపీ చేస్తున్న హంగామా చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా రాజ్యసభలో హోదాపై పోరాటం పోరుతో నోటీసులు ఇస్తున్న వైసీపీ ఎంపీలు.... లోక్ సభలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

వైసీపీ ప్రత్యేక హోదా పోరు
ఏపీకి ప్రత్యేక హోదా తెస్తామని గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్న వైసీపీకి ఇప్పుడు హోదాను ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. కేంద్రంతో రెండున్నరేళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తున్నా హోదాపై మాత్రం ఎలాంటి హామీ లభించలేదు. ఓవైపు బేషరతుగా కేంద్రానికి మద్దతిస్తున్నా ఏపీకి హోదాపై మాత్రం పోరాటాలు చేసుకోవాల్సిన దుస్ధితి వైసీపీకి ఎదురవుతోంది. దీంతో అటు కేంద్రాన్ని డిమాండ్ చేయలేక, ఇటు మౌనంగా ఉంటూ ప్రజల్లో పలుచన కాలేక వైసీపీ చేపట్టిన ప్రత్యేక హోదా పోరు ఆభాసుపాలవుతోంది.

రాజ్యసభలో వైసీపీ హంగామా
రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రూల్ 267 కింద చర్చ కోసం వైసీపీ పట్టుబడుతోంది. చర్చకు రాజ్యసభ ఛైర్మన్ అంగీకరించకపోవడంతో వెల్ లోకి దూసుకెళ్లి మరీ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారు. దీంతో రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ చేస్తున్న పోరాటం చర్చనీయాంశమవుతోంది. గత పార్లమెంటు సమావేశాల్లో లేని విధంగా వైసీపీ రాజ్యసభలో చర్చ కోసం చేస్తున్న పోరాటం మిగతా పార్టీల్లోనూ చర్చకు దారి దీస్తోంది. అయినా అక్కడే ఉన్న కేంద్ర మంత్రులు మాత్రం స్పందించడం లేదు.

లోక్ సభలో వైసీపీ మౌనం
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో నోటీసులిస్తూ, నిరసనలకు దిగుతున్న వైసీపీ ఎంపీలు.. లోక్ సభకు వచ్చేసరికి మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. వైసీపీకి రాజ్యసభలో ఆరుగురు ఎంపీలుండగా.. లోక్ సభలో మాత్రం రఘురామరాజు మినహా 21 మంది ఎంపీలున్నారు. అయినా లోక్ సభలో మాత్రం ప్రత్యే్క హోదాపై వైసీపీ నోరెత్తడం లేదు. దీంతో రాజ్యసభలో మాత్రమే వైసీపీ ప్రత్యేక హోదా పోరు ఎందుకు చేస్తోందన్న చర్చ సాగుతోంది. అటు నాలుగో అతిపెద్ద పార్టీగా లోక్ సభలో మాట్లాడే అవకాశం ఉన్నా దాన్ని వైసీపీ ఎందుకు వినియోగించుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వైసీపీ వ్యూహమిదే
ఓవైపు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నా ప్రత్యేక హోదా వంటి కీలక హామీని మాత్రం వైసీపీ నెరవేర్చుకోలేకపోతోంది. దీంతో ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు బయటికి చెబుతోంది. కానీ కీలకమైన లోక్ సభను వదిలిపెట్టి రాజ్యసభలో చర్చ కోసం వైసీపీ నోటీసులు ఇస్తోంది. నోటీసులతో సరిపెట్టకుండా నిరసనలు కూడా చేపడుతోంది. దీంతో వైసీపీ వైఖరి ఇతర పార్టీల్లోనూ చర్చనీయాంశమవుతోంది. కేంద్రానికి ఆగ్రహం తెప్పించకూడదనే వైసీపీ ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications