Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతిపై తీరని అనుమానాలు ? హైకోర్టులో పిటిషన్లు..!
ఏపీలో పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల దర్యాప్తు పూర్తయి రోడ్డు ప్రమాదంగా ప్రకటించిన తర్వాత కూడా ఇంకా క్రైస్తవ వర్గాల్లో ఇంకా అనుమానాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా పోలీసులు ప్రవీణ్ పోస్టుమార్టం నివేదిక బయటపెట్టకపోవడం, సీసీ కెమెరా ఫుటేజ్ ల విడుదల ద్వారా రోడ్డు ప్రమాదంగా నిరూపించేందుకు జరిగిన ప్రయత్నాల నేపథ్యంలో అనుమానాలు ఇంకా అలాగే ఉండిపోయాయి. దీంతో పాస్టర్ ప్రవీణ్ మృతిపై తిరిగి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ లోని తిరుమలగిరిలో బుల్లెట్ బైక్ పై బయలుదేరి విజయవాడ హైవే మీదుగా రాజమండ్రి వరకూ వచ్చాక అక్కడ రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసుల దర్యాప్తు వెల్లడించింది. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి పోలీసు వ్యవహారశైలిపై క్రైస్తవ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతూనే వచ్చాయి. అయితే పది రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు ఎలాంటి క్లూ లభించకపోవడంతో దీన్ని రోడ్డు ప్రమాదంగానే నిర్ధారిస్తూ ప్రకటన చేశారు. దీంతో దర్యాప్తు ముగిసింది.

అయితే పోలీసుల వ్యవహారశైలితో పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీంతో క్రైస్తవ వర్గాల నుంచి తిరిగి దర్యాప్తు చేయించాలనే ఒత్తిడి ప్రభుత్వంపై పెరుగుతోంది. దీన్ని మరింత పెంచేలా హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ తో పాటు పలువురు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.
తనకు ఎన్నో పోస్టు మార్టం రిపోర్టులు చూసిన అనుభవం ఉందని, మద్యం సేవించడం వల్లే పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడని పోస్టుమార్టంలో కావాలని రాసినట్లుందని లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. ప్రవీణ్ మృతిపై మాట్లాడిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని బట్టి చూస్తే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన వెల్లడించారు.కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ ను ఇదే కేసులో అరెస్టు చేయడాన్ని విజయకుమార్ ఖండించారు.












Click it and Unblock the Notifications