చంద్రబాబు ఆదేశం, టిడిపి ఎంపీలతో సభలో గందరగోళం, వెల్లోకి వైసిపి

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపలా ఆందోళన నిర్వహించారు. సోమవారం ఉదయం పదకొండు గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో విపక్ష నేతలతో పాటు టిడిపి ఎంపీలు కూడా జత కలిశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలో సభలో నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున వారు నినాదాలు చేశారు. సమావేశాలకు వచ్చిన టిడిపి ఎంపీలు తొలుత పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు.

Also Read: రాజీనామా చేస్తాం!: సుజన, అశోక్, నాకే మండింది.. చంద్రబాబు క్లాస్

ఆ తర్వాత సభ ప్రారంభమైంది. సభలోకి వచ్చిన టిడిపి ఎంపీలు అక్కడ కూడా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి తీరాలంటూ టీడీపీ ఎంపీలు చేస్తున్న నినాదాలతో సభ దద్దరిల్లింది. ఓ వైపు ప్రశ్నోత్తరాలు మొదలైనా టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

సభ్యుల నిరసనల మధ్యనే గంటకు పైగా ప్రశ్నోత్తరాలు కొనసాగించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం.. ప్రత్యేక హోదా అంటూ నినదించారు. టిడిపి సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. గందరగోళం మధ్యనే సభ కొనసాగింది.

టిడిపి ఎంపీలు ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడాలని సభకు విజ్ఞప్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకుపోయారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ వైసిపి ఎంపీలకు హితవు పలికింది.

ఎంపీలకు బీజేపీ విప్ జారీ

ప్రత్యేక హోదా అంశం పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రయివేటు మెంబర్ బిల్లు రాజ్యసభను ఓ కుదుపు కుదిపింది. ఎలాగోలా ఆ బిల్లును అడ్డుకోవడంలో బీజేపీ సఫలమైంది.

అయితే దీని ఫలితంగా తనకు మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నిరసన బాట పట్టడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు. ఈ రోజు సమావేశాల్లో భాగంగా గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగిన టీడీపీ ఎంపీలు పార్లమెంటులో నినాదాల హోరు వినిపించారు.

Also Read: టిడిపి దూరమైతే..: బాబు హెచ్చరికతో మోడీ అప్రమత్తం, దిద్దుబాట!

ఏ సమయంలో ఏం జరుగుతుందోననే ఆందోళనతో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఈ వారమంతా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని ఎంపీలకు హుకుం జారీ చేసింది. అయితే, జీఎస్టీ బిల్లు నేపథ్యంలోనే ఈ విప్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. రేపు సభకు జీఎస్టీ బిల్లు వచ్చే అవకాశముంది.

కాగా, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ ఎంపీలకు ఢిల్లీ వేదికగా నిరసన తెలపాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం, మంగళవారం నిరసన తెలుపుతామని చంద్రబాబు ఆదివారం ప్రకటించారు. బాబు సూచనలతో టిడిపి ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. తద్వారా ఎన్డీయే ప్రభుత్వంపై హోదా కోసం ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
DP will pressure NDA government over granting special status to Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి