రౌడీషీటర్ల బీభత్సం.. మద్యం మత్తులో కారుతో చిన్న పిల్లాడ్ని ఢీకొట్టి
సంక్రాంతికి ఇంటికి చేరుకుంటున్న వారితో విజయవాడ నగరం ట్రాఫిక్ రద్దీ నెలకొని ఉంది. అందులోనూ ఆదివారం కావడంతో కుటుంబంతో కలిసి కృష్ణా నది ఒడ్డున కాసేపు సరదాగా, ప్రశాంతంగా ఉందా అని వచ్చిన వారు భయబ్రాంతులకు గురయ్యారు. చల్లగా ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తున్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి. మద్యం మత్తు, రౌడీ షీట్ల దురహంకారం, చేతిలో కారు... ఈ మూడు కలిసినప్పుడు ఏమవుతుందో మరోసారి రుజువైంది. చిన్న పిల్లలు, పాదచారులు తిరిగే ప్రాంతంలో అతి వేగంతో కారు దూసుకెళ్లి నలుగురిని ఢీకొట్టింది. ముఖ్యంగా పదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడటం ఈ ఘటనను మరింత కలచివేసేలా చేసింది.
ఆదివారం సాయంత్రం పున్నమిఘాట్ బబ్బూరి గ్రౌండ్స్ పరిసరాల్లో రౌడీ షీటర్ల గుంపు కారులో రౌండ్లు వేస్తూ హడావిడి సృష్టించింది. పెద్ద చిచ్చా, చిన్న చిచ్చా, దినేష్ అనే రౌడీ షీటర్లతో పాటు వారి స్నేహితులు భార్గవ్, మహేష్ కలిసి మద్యం సేవించి.. ఫుల్ గా మత్తెక్కిన స్థితిలో కారును నిర్లక్ష్యంగా నడిపి విధ్వంసం సృష్టించారు. జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్డుపై అతి వేగంగా కారును తిప్పుతూ భయాందోళనకు గురిచేశారు.

"నేనెవరినో తెలుసా?"
ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు, "ఇక్కడ పిల్లలు తిరుగుతున్నారు... ఇలా డ్రైవ్ చేయడం ఏమిటి?" అంటూ ప్రశ్నించారు. అయితే పరిస్థితి అక్కడే ఉద్రిక్తంగా మారింది. కారులో నుంచి దిగిన చిన్న చిచ్చా తీవ్ర ఆగ్రహంతో స్థానికులను బెదిరించాడు. "నేనెవరినో తెలుసా?" అంటూ రౌడీ షీటర్‌నని దర్పం ప్రదర్శించాడు. ఆ మాటలతోనే ఆగకుండా, కారులో ఉన్న పెద్ద చిచ్చా స్టీరింగ్‌ను ఒక్కసారిగా ముందుకు నెట్టాడు. క్షణాల్లోనే కారు అదుపు తప్పి రహదారి పక్కన నిలబడి ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పదేళ్ల పఠాన్ రిహాన్‌ఖాన్, సాక్షి రిపోర్టర్ నాగేంద్రతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆరో తరగతి చదువుతున్న రిహాన్‌ఖాన్ తన తండ్రితో కలిసి ఐస్‌క్రీం తినేందుకు పున్నమిఘాట్ వద్దకు వచ్చాడు. అంతలోనే వచ్చిన కారు అతని జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రమాదం సృష్టించిన కారును తీసుకుని రౌడి బ్యాచ్ అంతా అక్కడి నుంచి పరారయ్యారు.
హల్ చల్ చేసి పరారీ..
సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారును రామవరప్పాడుకు చెందిన రాజేష్ పేరిట రిజిస్టర్ అయిన వాహనంగా గుర్తించారు. కారు విజయవాడ దాటి వారధి మీదుగా గుంటూరు జిల్లా వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో తేలడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో తాడేపల్లి ప్రాంతంలో కారును గుర్తించి చిన్న చిచ్చా, భార్గవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం. వారి కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
భయపెట్టే రీల్స్ చేస్తూ..
ఈ ఘటన నగరంలో రౌడీషీటర్ల నియంత్రణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. మద్యం మత్తులో రహదారిని అడ్డంగా మార్చి, ప్రాణాలపైకి తెచ్చిన ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. "చట్టం చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి రౌడీ అయినా తప్పించుకోలేడు" అన్న హెచ్చరికతో దర్యాప్తు కొనసాగుతోంది. పెద్ద చిచ్చా, చిన్న చిచ్చాలపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే రౌడీ షీట్లు ఉన్నాయి. దినేష్‌పై భవానీపురం పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉంది. పెద్ద చిచ్చా సోషల్ మీడియాలో టాటూలు, బ్లేడ్ గాట్లతో భయపెట్టే రీల్స్ చేస్తూ పోలీసులను కూడా లక్ష్యంగా చేసుకుని గతంలో వీడియోలు పోస్ట్ చేసిన చరిత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.












Click it and Unblock the Notifications