ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి ముహూర్తం ఖరార్
AP DSC notification: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తోన్న ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంది. వేలాది టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది.
రాష్ట్రవ్యాప్తంగా 6,100 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామంటూ ఇదివరకే జగన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అవసరమైన ప్రతిపాదనలను మంత్రివర్గం ఆమోదించింది. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలంటూ ఇటీవలే వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేసింది.

దీనికి అనుగుణంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ఖాళీల వివరాలన్నింటినీ తెప్పించుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అన్ని జిల్లాల కలెక్టర్లు.. ప్రాథమిక విద్యా మంత్రిత్వ శాఖకు పంపించారు. వాటన్నింటినీ క్రోడీకరించి.. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసింది.
ఈ నెల 7వ తేదీన అంటే.. బుధవారం నాడు ఈ నోటిఫికేషన్ వెలువడొచ్చని తెలుస్తోంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో- ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంలో ఎలాంటి జాప్యం చేయకూడదని నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ప్రవర్తన నియమావళి కూడా అమల్లోకి వస్తుందని, ఫలితంగా ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవడం కష్టతరమౌతుందని భావిస్తోంది.
మెగా డీఎస్సీ భర్తీలో తీసుకోవాల్సిన చర్యలపై విధి విధానాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసిందని చెబుతున్నారు. ఈ ఉదయం మంత్రి బొత్స సత్యనారాయణ.. దీనిపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మెగా డీఎస్సీ విధి విధానాలు ఎలా ఉండాలనే విషయంపై చర్చించారు.












Click it and Unblock the Notifications