కరోనా ఎపెక్ట్ : ఏపీలో 1200 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేసే యోచనలో జైళ్లశాఖ..
ఏపీలో కరోనా భయాలు అంతకంతకూ ఎక్కువవుతున్న నేపథ్యంలో జైళ్ల శాఖ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల తరహాలోనే ప్రస్తుతం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో కొందరిని పెరోల్ పై బయటికి పంపాలని భావిస్తోంది. అయితే ప్రభుత్వం నుంచి తుది అనుమతి రావాల్సి ఉందని తెలుస్తోంది. ప్రభుత్వానికి ఇప్పటికే అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలు పంపారు.

ఏపీలో కరోనా భయాలు- జైళ్లకూ..
ఏపీలో కరోనా భయాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు చేస్తో్ంది. అయితే జైళ్లలో ఉన్న ఖైదీలకు మాత్రం విముక్తి లభించే పరిస్ధితి లేదు. అయితే విచారణ ఖైదీలతో పాటు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విషయంలో జైళ్ల శాఖ ఇప్పుడు ఆలోచనలో పడింది. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో వివిద రాష్ట్రాలతో పాటు దేశాల్లోనూ ప్రభుత్వాలు ఖైదీలను వదిలిపెడుతున్న నేపథ్యంలో నిబంధనలను పరిశీలిస్తున్న జైళ్ల శాఖ ఈ మేరకు 1200 మంది శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్ పై ఇళ్లకు పంపితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది.

ఇప్పటికే పెండింగ్ లో దరఖాస్తులు..
ఇప్పటికే ఏపీలోని పలు సెంట్రల్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో ఏడేళ్లు శిక్షాకాలం పూర్తి చేసుకున్న ఖైదీలు ఇప్పటికే తమకు పెరోల్ మంజూరు చేయాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తాము జైళ్లలో కంటే ఇంట్లో ఉంటేనే సురక్షితంగా ఉంటామని వారు దరఖాస్తుల్లో ప్రభుత్వానికి విన్నవించారు. దీంతో వీరితో పాటు శిక్ష అనుభవిస్తున్న మిగతా ఖైదీలను కూడా పెరోల్ పై ఇళ్లకు పంపితేనే మేలని జైలు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. వీటిపై ప్రభుత్వం రేపోమాపో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

పెరోల్ ఇవ్వక పోతే.. మరిన్ని సమస్యలు..
ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్ పై బయటికి పంపకపోతే పలు రకాల సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. వీరిని చూసేందుకు వారానికో, పది రోజులకోసారి వారి బంధువులకు ములాఖత్ కు అనుమతులు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ పరిస్దితుల్లో అది సాద్యం కాదు. అలాగని బంధువులతో ములాఖత్ లు రద్దు చేస్తే ఖైదీల నుంచి వ్యతిరేకత వచ్చే పరిస్ధితి ఉంది. సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లోనే ఇతర రాష్ట్రాల్లోనూ ఖైదీలు జైలు అధికారులపై దాడులకు పాల్పడుతున్న కేసులు నమోదవుతున్నాయి. దీంతో జైళ్ల శాఖ అలాంటి పరిస్ధితి రాకముందే వీరిని పెరోల్ పై బయటికి పంపితేనే మంచిదని ప్రభుత్వాన్ని కోరుతోంది.












Click it and Unblock the Notifications