నవయుగకు సీఎం జగన్ మాస్టర్ స్ట్రోక్: కృష్ణపట్నం ఇన్‌ఫ్రా భూ కేటాయింపులు రద్దు: అసలు లక్ష్యం వారేనా ..
నవయుగ సంస్థ మీద ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వంలో కీలకంగా మారిన నవయుగ సంస్థను ఇప్పుడు ప్రభుత్వం కోలుకోలేని విధంగా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నుండి నవయుగను తప్పించిన జగన్ ప్రభుత్వం..ఆ తరువాత బందర్ పోర్టు కాంట్రాక్టు రద్దు చేసింది. ఇక, ఇప్పుడు కృష్ణపట్నం ఇన్‌ఫ్రా సెజ్ భూములు సొంత అవసరాలకు వినియోగించుకున్నారనే కారణంతో
కృష్ణపట్నం ఇన్‌ఫ్రాకు భూమి కేటాయింపులు రద్దు చేయాలని ఏపీఐఐసీ నిర్ణయించింది.
నవయుగ సంస్థ పోర్టు నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి తీసుకున్న 4,731.5 ఎకరాల భూమిపై బ్యాంకుల నుంచి రూ.1,935 కోట్ల రుణం పొందింది. ఏపీఐఐసీ ఎన్‌ఓసీ ఇవ్వకుండానే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లుగా గుర్తించటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవయుగ సంస్థకు అప్పటి సీఎం చంద్రబాబు అండగా నిలిచారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరోసారి రాజకీయంగా వివాదానికి కారణమయ్యే అవకాశం ఉంది.

నవయుగకు భారీ దెబ్బ..
భారీ సెజ్‌ను ఏర్పాటు చేయడానికి నవయుగ గ్రూపు కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 2009, 2010లో రెండు విడతలుగా మొత్తం 4,731.5 ఎకరాల భూమిని తీసుకుంది. ఈ భూమిని ఎకరం కేవలం రూ.1.15 లక్షలకే కేఐపీఎల్‌కు ఏపీఐఐసీ విక్రయించింది. ఈ భూములను సెజ్ అభివృద్ధి కోసం వినియోగించకుండా నవయుగ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకుంది. ఈ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి, రూ.వేల కోట్ల పొందినట్లు ఏపీఐఐసీ పరిశీలనలో తేలింది. నవయుగ గ్రూపునకు చెందిన మచిలీపట్నం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, నవయుగ ఇంజనీరింగ్, కాటలిస్ట్ ట్రస్టీషిప్ ఇలా అనేక అనుబంధ కంపెనీల పేరిట ఏకంగా రూ.1,935 కోట్ల రుణాలు తీసుకుంది. భూములను తనఖా పెట్టి రుణం తీసుకోవాలంటే ఏపీఐఐసీ నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఎన్‌వోసీ లేకుండానే పలు బ్యాంకులు నవయుగ సంస్థకు రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చేశాయి. ఇవన్నీ ఏపీఐఐసీ విచారణ బయటకు వచ్చాయి. దీంతో..నవయుగకు కేటాయించిన భూ కేటాయింపుల రద్దు చేసారు.

నోటీసులు పంపినా..నాటి ప్రభుత్వం అండతో..
నవయుగ సంస్థ సెజ్ పనులను ప్రారంభించకపోవడంతో భూములు వెనక్కి తీసుకోవడానికి ఏపీఐఐసీ పలుమార్లు నోటీసులు పంపినా అప్పటి ప్రభుత్వం అండతో చర్యలు నిలిచి పోయాయని చెబుతున్నారు. ఒకసారి ఫైనాన్స్ విభాగం కొర్రి వేసి పంపితే దానికి ఏపీఐఐసీ సమాధానం ఇచ్చింది. దానితో ఫైల్ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి వద్దకు చేరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో ఈ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపించారు. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి మరో సందేహం లేవనెత్తి పరిశ్రమల శాఖకు వెనక్కి పంపించారు. ఇలా అప్పటి సీఎం చంద్రబాబు నవయుగకు ఇతోధికంగా సాయం చేశారని అధికారులు వివరిస్తున్నారు. చంద్రబాబు అండతోనే ఈ భూములను నవయుగ సంస్థ తనఖా పెట్టి భారీ ఎత్తున రుణాలు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. సెజ్ నిర్మాణం విషయంలో నిబంధనలు ఉల్లఘించడం, పనులు మొదలు పెట్టకపోవడంపై నోటీసులు జారీ చేసినా కేఐపీఎల్ స్పందించకపోవడంతో 4,731.5 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఏపీఐఐసీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఇప్పుడు నవయుగ భారీగా కుదుపు ఎదుర్కోవాల్సి వస్తోందని విశ్లేషణలు వస్తున్నాయి.

అసలు లక్ష్యం అదేనా..
అయితే, ప్రభుత్వం వరుసగా నవయుగకు చెందిన అంశాల్లో వేగంగా నిర్ణయం తీసుకోవటం పైన రాజకీయంగా చర్చ మొదలైంది. నవయుగ సంస్థ టీడీపీకి ప్రధానంగా ఆర్దికంగా అండగా నిలిచిందనేది వైసీపీ నేతల అభిప్రాయం. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచే ఇద్దరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హాయంలో నవయుగ సంస్థకు భారీగా లబ్ది చేకూరేలా నిర్ణయాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఆర్దిక మూలాలను దెబ్బ తీయటంలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ ఉంది. ఇప్పటికే పోలవరం కాంట్రాక్టు రద్దు వ్యవహారం పైన నవయుగ కోర్టుకు వెళ్లింది. ఇక, ఈ తాజా నిర్ణయం పైన ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications