గౌరంగ బాబుకు మళ్లీ అదే అవమానం:"గుడి చైర్మన్ అయినా...క్యూలైన్లో రావాల్సిందే"...అనేశారు
విజయవాడ:ఇంద్రకీలాద్రి కనక దుర్గ ఆలయం చైర్మన్ యలమంచలి గౌరంగబాబుకు టైమ్ బాగాలేదో...లేక ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా చేయిస్తున్నారో తెలియదు కానీ...ఆయనకు మరోసారి అవమానం ఎదురైంది.
ఆదివారం పోలీసుల కారణంగా అవమానకర పరిస్థితి ఎదుర్కొన్న ఆయన 48 గంటలు కూడా గడవక ముందే మరోసారి అంతకంటే తీవ్ర అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈసారి కూడా కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చినప్పుడే ఇటువంటి పరిస్థితి ఎదురయింది. పైగా ఈసారి స్వయంగా ఈవోనే గుడి ఛైర్మన్ అయిన గౌరంగబాబుని నేరుగా ప్రత్యేక దర్శనానికి పంపేది లేదని...అందరితో పాటు క్యూ లైన్లో రావాల్సిందేనని అడ్డుకోవడం గమనార్హం. అసలేమైందంటే?...

విజయవాడ ఇంద్రకీలాద్రి పై కనక దుర్గ ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల వేడుకల్లో అమ్మవారి ప్రత్యేక దర్శనం కోసం మంగళవారం ఉదయం ఆలయం ఛైర్మన్ గౌరంగబాబు కుటుంబసమేతంగా గుడికి వచ్చారు. ఆలయం ఛైర్మన్ హోదాలో ప్రత్యేకదర్శనం కోసం ఆలయంలోకి నేరుగా వెళ్లేందుకు ఆయన ఉద్యుక్తులయ్యారు.
అయితే అక్కడే ఉన్న ఈవో కోటేశ్వరమ్మ అందుకు అభ్యంతరం చెప్పి ఆయన్ని అడ్డుకున్నారు. శరన్నవరాత్రుల వేడుకల్లో గుడి చైర్మన్ అయినా క్యూలైన్లో రావాల్సిందేనని ఆమె సూచించారు. దీంతో తనను మరోసారి అవమానించినట్లు భావించి ఆగ్రహించిన గౌరంగబాబు ఆలయం వద్దే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాలకమండలి సభ్యులు ఎంత నచ్చచెప్పినా వినకుండా అక్కడే బైఠాయింపు కొనసాగించారు.
దీంతో చివరకు ఈవో కోటేశ్వరమ్మ...గౌరంగబాబు వద్దకు వచ్చి నేరుగా ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పడంతో గౌరంగబాబు నిరసన విరమించారు. అయితే తనకు వరుసగా ఎదురవుతున్న అవమానాల పట్ల గౌరంగబాబు తీవ్ర మనస్థాపం చెందుతున్నట్లు తెలిసింది. ఆదివారం పోలీసుల కారణంగా కుటుంబ సభ్యుల సమక్షంలో అవమానం ఎదుర్కొన్న గౌరంగబాబు...రెండు రోజులైనా గడవక ముందే మరోసారి...అదీ సాక్షాత్తూ ఈవో ద్వారానే అవమానం పాలవడంపై ఆయన అనుచరులు,మద్దతుదారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.












Click it and Unblock the Notifications