219 ఆలయాలు ధ్వంసం: టీటీడీ ఉద్యోగులు బయటికి రావాలి.. లేదంటే
Pawan Kalyan: తిరుమల లడ్డూపై తలెత్తిన వివాదం నేపథ్యంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. ఈ ఉదయం గుంటూరు జిల్లా నంబూరులో గల శ్రీదశావతార వెంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్షను స్వీకరించారు. అనంతరం మాట్లాడారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులను ఉద్దేశించి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో తప్పు జరిగిందని తెలిసినప్పటికీ మౌనంగా ఉండటం సరికాదని తెలిసి కూడా మాట్లాడకపోతే టీటీడీ ఉద్యోగులే తప్పు చేసినట్టవుతుందని తేల్చి చెప్పారు.

తిరుమలలో జరిగిన తప్పుతో తనకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తోన్నానని, అలాంటిది తమ సమక్షంలో తప్పు జరిగిందని తెలిసి కూడా టీటీడీ ఉద్యోగులు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు అంటే భయపడుతున్నారా? అంటూ నిలదీశారు.
హిందూ మతాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, తమ ఎదురుగా జరుగుతున్న తప్పులను ఖండించాలి, బయటకు వచ్చి పోరాడాలి, నాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే మన ధర్మంపై తిరుమల లడ్డుపై జరిగినట్లుగా దాడులు జరుగుతాయని హెచ్చరించారు. శ్రీవారికి అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించకకపోవడం టీటీడీలో పనిచేస్తున్న హిందువులు చేసిన తప్పుగా పేర్కొన్నారు.
కోట్లాదిమంది శ్రీవారిని విశ్వసించే భక్తులను తిరుమల లడ్డూ కల్తీ ఘటన ఆవేదనకు గురిచేసిందని, ఇది హిందూ ధర్మంపై జరిగిన దాడి గా భావిస్తున్నానని పవన్ అన్నారు. అన్ని మతాలవాళ్లూ దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. తిరుమలలో జరిగిన ఘటన ఇంకెప్పుడు భవిష్యత్తులో జరగకుండా చూసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

తిరుమల లడ్డూ ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించేలా నిర్ణయం తీసుకోవలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. దోషులకు శిక్ష పడాల్సిందేనని తేల్చి చెప్పారు. టీటీడీ బోర్డులో జరిగిన తప్పుల గురించి ఎవరూ మాట్లాడకూడదు అంటే కుదరదని వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తాం, ఖండిస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పారు. వైసీపీ హయాంలో 219 దేవాలయాలను ధ్వంసం చేశారని పవన్ ఆరోపించారు.
టీటీడీ బోర్డు ఉన్నది ధర్మాన్ని పరిరక్షించడానికి మాత్రమేనని, టికెట్లు అమ్ముకోడానికో, ఇష్టానికి కాంట్రాక్టులు చేసుకోడానికోకాదని పవన్ గుర్తుచేశారు. తిరుమలలో జరిగిన విధంగా ఏ ధర్మంపై దాడి జరిగిన సరే ప్రపంచ వార్త అవుతుందని, ప్రతీ ఒక్కరూ మాట్లాడుతారని, కోట్లాది మంది హిందువులు ప్రసాదం అపవిత్రం అవుతుంటే మాత్రం ఎవరు మాట్లడకూడదా? అని ప్రశ్నించారు.
హిందువులకు మనోభావాలు ఉండవా? హిందువులపై దాడి జరిగితే చూస్తూ కూర్చోవాలా? తాను అన్ని మతాలను గౌరవించేవాడినని పవన్ చెప్పుకొచ్చారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇతర అన్ని మతాలను గౌరవిస్తానని, సనాతన ధర్మం అంటే అంటే అన్ని మతాలను సమానంగా చూస్తూ, మన మతాన్ని ఆచరించడమేనని అన్నారు.

గత టీటీడి బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, ఇతర పాలకులు, టీటీడీ కార్యవర్గంపై విచారణ జరగాలని, తప్పు ఎవరు చేశారో బయటకు తీయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుమల లడ్డూలో జంతువు కొవ్వు కలపడం అనేది నీచమైన చర్య, ప్రతి హిందువు, ధర్మాన్ని పాటించే ప్రతీ వ్యక్తి ఖండించి పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు
శతాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న రామ జన్మభూమి మందిరానికి జంతు కొవ్వు, చేప నూనెతో చేసిన లక్ష లడ్డూలను గత వైసీపీ ప్రభుత్వం టీటీడి నుండి పంపించడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications