ఈ నెల 20 నుంచి ఏపీలో.. !!
Chandrababu Naidu: విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మినహా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏదీ లేదు. రెండు నెలల కిందటే ఈ ప్రక్రియ మొత్తం ముగిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలవుతోంది.
జూన్ 12వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మొత్తం కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రెండు నెలల వ్యవధిలో చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొనబోతోన్న తొలి ఎన్నిక.. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీదే.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో నిలిచారు. టీడీపీ- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఇంకా తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ.. ఈ నెల 13. బొత్స సత్యనారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ వెల్లడించింది.
ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లును శరవేగంగా పూర్తి చేస్తోంది. ఈ నెల 20వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.
సుమారు రెండు నెలల పాటు అంటే అక్టోబర్ 18వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వేను చేపట్టనున్నారు. అక్టోబర్ 18వ తేదీ నాటికి ప్రక్రియను పూర్తి చేస్తారని, అదే నెల 29వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తారని సమాచారం.
ఆ తరువాత మరో నెల రోజుల పాటు అంటే నవంబర్ 28వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చే ఏడాది జనవరి 6వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారని తెలుస్తోంది. జనవరి 6వ తేదీన తుది జాబితా ప్రకటించాల్సి ఉన్నందున.. ఆ లోగా 18 ఏళ్లు నిండేవారు కూడా ఇప్పుడే ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించింది ఈసీ.












Click it and Unblock the Notifications