AP Elections: ఈసీ మరో సంచలనం-రెండ్రోజుల్లో అక్కడ రీపోలింగ్ ..!
ఏపీలో ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయాల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న ఎన్నికల సంఘం తొలిసారిగా ఓ ప్రాంతంలో రీపోలింగ్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. తద్వారా ఈ నెల 13న జరిగే పోలింగ్ లో ఏవైనా అవాంఛనీయ ఘటనలు, అక్రమాలు చోటు చేసుకుంటే ఏం చేయబోతోందో ముందే హింట్ ఇచ్చేసింది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్యోగులకు నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఓ సమస్య ఎదురైంది. ఇక్కడ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టల్ బ్యాలెట్ స్ధానంలో ఈవీఎం బ్యాలెట్ (టెండర్ బ్యాలెట్) పేపర్లను ఇచ్చేశారు. కానీ విషయం గుర్తించకుండా ఉద్యోగులు సైతం వాటిపైనే ఓట్లు వేసి ఇచ్చేశారు. కానీ చివర్లో విషయం తెలియడంతో అధికారులు నాలిక కరుచుకున్నారు. చివరికి ఈ వ్యవహారంపై విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. కచ్చితంగా రీపోలింగ్ నిర్వహించాలని కోరాయి.

దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా చిలకలూరిపేటలో పోస్టల్ బ్యాలెట్ కు బదులుగా టెండర్ బ్యాలెట్ ఇచ్చిన 1219 ఓట్లకు తిరిగి పోలింగ్ నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఈసీ ఆదేశాల మేరకు అక్కడ రెండు రోజుల్లో రీపోలింగ్ జరగబోతోంది. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి రీపోలింగ్ కు కారణమైన ఎన్నికల అధికారులపై చర్యలకు సైతం ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 9 లోగా వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications