Tenali Candidate: తెనాలి వైసీపీ అభ్యర్ధి చెంపదెబ్బపై ఈసీ ఆగ్రహం-హౌస్ అరెస్ట్ ..!
ఏపీలో ఇవాళ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ పోలింగ్ బూత్ లో చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై ఈసీ స్పందించింది. ఓటేసేందుకు స్ధానిక పోలింగ్ బూత్ కు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ తనలాగే ఓటేసేందుకు వచ్చిన ఓటర్ పై చేయి చేసుకోవడం, అతను తిరిగి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టడం, దీంతో ఎమ్మెల్యే అనుచరులు అతన్ని చితకబాదడం జరిగిపోయాయి. ఇది జాతీయ స్ధాయిలో చర్చకు దారి తీసింది.
తెనాలిలో క్యూలో నిలబడకుండా నేరుగా ఓటేసేందుకు ప్రయత్నించిన తనను అడ్డుకున్న ఓటర్ పై చెంపదెబ్బ కొట్టడం, తిరిగి అతను కొట్టాక తన అనుచరులతో దాడి చేయించిన వ్యవహారంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెనాలి వైసీపీ అభ్యర్ధి తీరుపై రాష్ట్రానికి ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన దీపక్ మిశ్రా ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారంటూ సీఈవోపై సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ ను అదుపులోకి తీసుకోవాలని ఈసీ నుంచి పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. ఇవాళ పోలింగ్ ముగిసేవరకూ ఆయన్ను హౌస్ అరెస్టు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇవాళ ఓటరును తాను చెంపదెబ్బ కొట్టాల్సి రావడం వెనుక ఉన్న కారణాలన్ని ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ వివరించారు. అతను పదే పదే తనను దూషించడం వల్లే కొట్టాల్సి వచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications