సుజనా సంస్థల్లో ఈడీ సోదాలు...కీలక పత్రాలు స్వాధీనం:దాడులు జరగలేదంటున్న సంస్థ ప్రతినిథి
హైదరాబాద్:ఏపీలో ఐటీ దాడుల హడావుడి సద్దుమణగకముందే మరోవైపు నుంచి ఈడీ రంగంలోకి దిగినట్లు వెలువడుతున్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి.
మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లో ఈడీ బృందం సోదాలు జరిపిందని...ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను సైతం స్వాధీనం చేసుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. చెన్నై నుంచి వచ్చిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది కొన్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రెండు రోజుల వ్యవధిలో హైదరాబాద్‌తో పాటు ఏపీలోనూ సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఐతే తమ సంస్థలపై ఎలాంటి దాడులు జరగలేదని సుజనా సంస్థల ప్రతినిధి తేల్చేస్తున్నారు.

హైదరాబాద్‌లో సుజనా చౌదరికి సంస్థల్లో జరిపిన సోదాల్లో ఈడీ అధికారులు అనేక కీలక విషయాలు గుర్తించారట. ఒకే చిరునామాపై వందకుపైగా కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు నిరూపించే పత్రాలు ఈడీకి లభ్యమయ్యాయట. అలాగే అక్రమ లావాదేవీల నియంత్రణ చట్టం కింద కోట్ల రూపాయల బ్యాంకు రుణాలకు చెందిన పత్రాలను, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, పలు అగ్రిమెంట్లన సైతం ఈ దాడుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు సీబీఐ మాజీ అధినేత విజయరామారావు కుమారుడు కె.శ్రీనివాస్ కల్యాణ్‌రావుపై 2016లోనే సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు సమాచారం, నకిలీ ధ్రువపత్రాలతో శ్రీనివాస్ బ్యాంకులను రూ.300 కోట్ల మేరకు మోసగించినట్లు సీబీఐ అప్పట్లో ఆ కేసు నమోదు చేయడం జరిగింది. అదే శ్రీనివాస్...సుజనా చౌదరికి సంబంధించిన సంస్థల్లోనూ డైరెక్టర్‌గా ఉండటం గమనార్హం.
ఆ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు అప్పట్లో శ్రీనివాస్ కార్యాలయాలు, ఆయన నివాసంలో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ దాడుల్లోనూ సుజనా చౌదరి సంస్థలతో శ్రీనివాస్ ప్రమేయానికి సంబంధించిన పత్రాలు బయటపడ్డాయని అప్పట్లోనే దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యవహారాలు వందల కోట్ల రూపాయలకు సంబంధించినవి కావడంతో తాజాగా ఈడీ రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు.
ఇదిలావుంటే చెన్నై ఈడీ బృందం సోదాలకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఈడీ హైదరాబాద్ జోన్ విభాగం తెలిపింది. అయితే సుజనా చౌదరి సంస్థలపై ఈడీ దాడులనే ప్రచారాన్ని ఆ సంస్థ ప్రతినిధి ఖండించారు. ఈడీ అధికారులు తమ కార్యాలయానికి వచ్చిన విషయం వాస్తవమేనని...అయితే శ్రీనివాస్ సంస్థలతో తమ కంపెనీలకు లావాదేవీలు ఉన్నందున ఆ వివరాలు తెలుసుకునేందుకే ఈడీ అధికారులు వచ్చారు తప్ప తమ కంపెనీలపై ఎలాంటి దాడులు జరగలేదని అతడు స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications