ఏపీ ఎన్నికలపై ఈసీ తొలి అడుగు-అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ మార్గదర్శకాలు జారీ..
ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ ఆయా రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, నియామకాల కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల అధికారులు, సీఎస్ లకు ఆదేశాలు పంపింది. ఎన్నికల సమయంలో జరగాల్సిన అధికారుల బదిలీలు, పోస్టింగ్స్ పై ఈ మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారుల్ని బదిలీ చేయాలన్న నిబంధన ప్రకారం ఈసీ ఇవాళ ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు మార్గదర్శకాలు పంపింది. ఇందులో నేరుగా ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ అధికారి కూడా తన సొంత జిల్లాలో ఉండకూడదని పేర్కొంది. అలాగే మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న లేదా 2024 జూన్ 30 నాటికి మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటున్న వారిని ఆయా ప్రాంతాల్లో కొనసాగించరాదని తెలిపింది.

అలాగే ప్రత్యామ్నాయాలు లేని చిన్న రాష్ట్రాల్లో ఈసీ సూచనల ఆధారంగా బదిలీలు, పోస్టింగ్స్ లు చేపట్టాలి. జిల్లాల ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వో, ఏఈఆర్వో, తహసీల్దార్, బ్లాక్ డెవలప్ మెంట్ అధికారుల వరకూ ఈసీ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. వీరితో పాటు మున్సిపల్ కార్పోరేషన్లు, డెవలప్మెంట్ అధారిటీలకు కూడా ఇవి వర్తిస్తాయని పేర్కొంది.
పోలీసుశాఖలోనూ సబ్ ఇన్ స్పెక్టర్ స్దాయి నుంచి అదనపు డైరెక్టర్ జనరల్ స్ధాయి వరకూ ఈసీ మార్గదర్శకాలు వర్తింపచేయాలని పేర్కొంది. ఇలా చేపట్టిన బదిలీలు, పోస్టింగ్ లకు సంబంధించిన నివేదికను 2024 జనవరి 31లోగా తమకు సమర్పించాలని ఆయా రాష్ట్రాల సీఎస్ లు, ఎన్నికల అధికారుల్ని ఈసీ ఆదేశించింది. దీంతో ఈసీ మార్గదర్శకాల ప్రకారం ఆయా రాష్ట్రాలు అధికారుల బదిలీలు, పోస్టింగ్ లు చేపట్టబోతున్నాయి.












Click it and Unblock the Notifications