AP Employees: జగన్ డిప్యూటీ సీఎంకు ఉద్యోగుల చేతిలో పరాభవం..!
ఏపీలో ఎన్నికల వేళ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికీ, ఉద్యోగులకూ మధ్య ఈ ఐదేళ్లలో వచ్చిన గ్యాప్ ప్రభావం ఈ ఎన్నికలపై పడేలా కనిపిస్తోంది. ఇందుకు సూచనగా ఇవాళ ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లిగూడెంలో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు ఇవాళ ఉద్యోగుల చేతిలో అవమానం ఎదురైంది.
వచ్చే ఎన్నికల కోసం ఉద్యోగులకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు సేకరిస్తోంది. ఇలా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు తాడేపల్లిగూడెంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు ఉద్యోగులు ఎదురుతిరిగారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రం నుంచి ఆయన్ను బయటికి వెళ్లే వరకూ తరిమికొట్టారు. దీంతో ఆయన చేసేది లేక వెనుదిరిగారు.

తాడేపల్లిగూడెంలో ఇవాళ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులని మంత్రి కొట్టు సత్యనారాయణ బెదిరించటంతో ఉద్యోగులు తిరగబడ్డారు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు పోయాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పోతావా లేదా అంటూ ఆయన్ను ప్రశ్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని ఉద్యోగులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే ఉద్యోగులు మాత్రం పోలీసుల మాట కూడా వినలేదు. మర్యాదగా మంత్రిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక మంత్రి కొట్టు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications