పెంచిన జీతాలు వద్దంటూ సమ్మెనా - కరోనా బీభత్స వేళ : ఉండవల్లి కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ప్రభుత్వోద్యుగులు సమ్మె బాట పడుతున్నారు. ఈ మధ్నాహ్నం అన్ని సంఘాల జేఏసీగా సీఎస్ కు సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించాయి. ఇప్పటికే వీరితో చర్చలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం చర్చలకు ఆహ్వానించినా వారు ముందుగా పీఆర్సీ జీవోలను రద్దు చేస్తేనే చర్చకు వస్తామని తెగేసి చెబుతున్నాయి. దీంతో..సమ్మె నోటీసు ఇవ్వటానికి రంగం సిద్దం అవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వం సైతం నిరసనలకు దిగుతున్న ఉద్యోగులపైన ఎటువంటి చర్యలు వద్దని భావిస్తోంది.

ఏపీలో కరోనా వేళ సమ్మె టెన్షన్
అయితే, కరోనా వేళ సమ్మెకు దిగితే ఎటువంటి ప్రభావం పడుతుందో అనే తర్జన భర్జన ఉద్యోగ సంఘాల నేతల్లో వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. కరోనా కేసులు రాష్ట్రంలో నిత్యం 12 వేలకు సైగా నమోదవుతున్నాయి. కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ సమయంలో సమ్మెకు వెళ్లటమా.. మరి కొంత కాలం వేచి చూడటమా అనే అంశం పైన లోతుగా చర్చలు చేసినట్లుగా సమాచారం. ప్రభుత్వం సైతం ఉద్యోగుల విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఈ సమయంలో సమ్మె బాట పడితే ఉద్యోగులకు మద్దతు ఉండదనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. న్యాయస్థానాలు సైతం ఈ సమయంలో సమ్మెను సమర్ధించే అవకాశం ఉందని ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు అంచనా వేస్తున్నారు.

ఈ రోజునే సమ్మె నోటీసు ఇచ్చేలా
దీంతోపాటుగా ఈ నెల జీతంతోనే పెరిగిన వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందు కోసం ట్రెజరీ ఉద్యోగులు సహకరించకపోయినా.. పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల ద్వారా వేతనాల బిల్లులు సిద్దం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి ఉద్యోగుల సమ్మె అంశం పైన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగుల తాజా పరిస్థితి తాను ఇప్పటి వరకూ ఎప్పుడు ఎక్కడ చూడలేదని అంటున్నారు. ఉద్యోగస్తులకు కొత్త పి.ఆర్.సి అమలు చేయటం వల్ల 10,247 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని ప్రభుత్వం అంటుంది. ఉద్యోగస్తులు అసలు మాకు జీతాలు పెంచొద్దు... మాకు పెంచిన కొత్త జీతాలు వద్దు పాత జీతాలే చాలు అంటున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగుతున్నారు.

ఉండవల్లి కీలక వ్యాఖ్యలు
అసలు ఇలాంటి పరిస్థితి తానెప్పుడూ చూడలేదని ఉండవల్లి పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా..ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ జీతాలు పెంచాలంటూ సమ్మెలు చేయటం చూశాను.. అంతేకానీ మాకు పెంచిన జీతాలు వద్దు.. పాత జీతాలే ముద్దు అంటూ సమ్మె నోటీసు ఇవ్వడం బహుశా ఇదే ప్రధమం అనుకుంటానని ఉండవల్లి పేర్కొన్నారు. ఒకపక్క కరోనా బీభత్సం సృష్టిస్తోంది..మరొక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. ఇవన్ని ప్రభుత్వ ఉద్యోగులు దృష్టిలో పెట్టుకుని సమ్మెను ఆపవలసిందిగా ప్రార్ధిస్తున్నానని చెప్పారు.
Recommended Video

ప్రభుత్వం - ఉద్యోగులకు సూచన
జగన్ ప్రభుత్వము, ఉద్యోగ సంఘాలు.. పట్టింపులకు పోకుండా, చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం సాధించవల్సిందిగా ఉండవల్లి అరుణ కుమార్ కోరారు. అయితే, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం సమ్మె తప్పదని చెబుతున్నారు. ప్రభుత్వం సైతం బుజ్జగింపుల ద్వారా వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తూనే... వారు సమ్మెకు వెళ్లే అవకాశం లేదనే ధీమాతో కనిపిస్తోంది. దీంతో..ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతోందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications