యువతకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. త్వరపడండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల ఆరోగ్య సంక్షేమం కోసం ఏపీ సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పేదలపై ఆర్థిక భారం తగ్గించి, వారికి ఆరోగ్య సేవలు అందించడానికి తాజాగా తీసుకున్న నిర్ణయాలు ప్రస్తుతం ఏపీలో ప్రజల సంతోషానికి కారణంగా మారింది. రాష్ట్రంలో వైద్యసేవలను మెరుగుపరచడం పై దృష్టి పెట్టిన చంద్రబాబు నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆరోగ్య విషయంలో పేదలపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రతీ మండలంలోనూ జనరిక్ మందుల షాప్
ఆరోగ్య బీమా లో మార్పులు చేయాలని కొత్త వైద్యశాలలను ఏర్పాటు చేయాలని, ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని, యోగా, నేచురోపతి అభివృద్ధి వంటి అంశాల పైన దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో జనరిక్ ఔషధాలను పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు సూచించారు. దీని కోసం ప్రతి మండలంలోనూ జనరిక్ మందుల షాపును ఏర్పాటు చేయాలన్నారు.

బీసీ కార్పోరేషన్ ద్వారా జన ఔషధీ స్టోర్స్.. యువతకు ఉపాధి
జన ఔషధీ స్టోర్స్ ఏర్పాటు కోసం బీసీ కార్పొరేషన్ నుంచి వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి అనుమతులు ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీని ద్వారా బిసి యువతకు ఉపాధి అవకాశాలను ఇచ్చినట్టు అవుతుందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద వైద్య బీమా పరిమితిని రూ. 25 లక్షలకు పెంచే అంశంపైనా చంద్రబాబు చర్చించారు.
వైద్య బీమాపై చంద్రబాబు కీలక ఆదేశం
ప్రస్తుతం 1.43 కోట్ల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుండగా, దీన్ని 1.63 కోట్ల కుటుంబాలకు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇది కార్యరూపం దాలిస్తే రాష్ట్రంలో 5.02 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఇక ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మించేలా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ఆస్పతులలో పడకల పెంపుపై చంద్రబాబు ఆదేశం
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 1000 మందికి 2.24 బెడ్స్ ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశ కాల ప్రకారం మూడు బెడ్లు ఉండాలని ఆయన గుర్తు చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో మరో 12756 పడకలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీనిపైన సమగ్ర అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలల పనుల పైన చంద్రబాబు సమీక్షించారు.
నేచరోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్
ప్రజలలో ఆరోగ్య స్పృహను పెంచేందుకు యోగా, నేచరోపతిని ప్రోత్సహించేలా 'యోగా ప్రచార పరిషత్'ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3 రీజనల్ స్టడీ సెంటర్లలో 64 మంది సభ్యులను నియమించేందుకు అనుమతించారు. అమరావతి పరిధిలో నేచరోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో 45 రోజుల్లోగా ఉచిత వైద్య పరీక్షల పైలెట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ప్రతి గ్రామానికి 'ఆరోగ్యం రథం' ద్వారా మొబైల్ వైద్య సేవలు
ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించే క్రమంలో కుప్పం, శాంతిపురం, రామకుప్పంతో పాటు మరిన్ని ల్యాబ్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. శాంపిల్ కలెక్షన్ టీమ్‌లను పెంచాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి 'ఆరోగ్యం రథం' ద్వారా మొబైల్ వైద్య సేవలు అందించాలని సూచించారు. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్‌లను అమలు చేయాలని నిర్దేశించారు. ఎన్టీఆర్ బేబీ కిట్స్ పథకాన్ని త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications