వడదెబ్బ: మాట్లాడుతూ కుప్పకూలిన ఎర్రబెల్లి దయాకర్
వరంగల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఎన్నికల ప్రచారంలో ఎండదెబ్బ తగలడంతో అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం కార్యకర్తలతో మాట్లాడుతూ.. ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.
వడదెబ్బ తగలడంతో పాటు చక్కెర నిల్వలు కూడా పడిపోయినట్లు చికిత్స అందించిన వైద్యులు పేర్కొన్నారు. పాలకుర్తిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

ఎర్రబెల్లి అస్వస్థతకు గురికావడంతో టిడిపి కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. కాగా, గతంలో కూడా ఎర్రబెల్లి దయాకర్ ఈ విధంగానే అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ప్రచారం నిర్వహించిన సందర్భంలో ఆయనపై తేనే టీగలు దాడి చేయడంతో కొంత అస్వస్థతకు గురయ్యారు.
గత సోమవారం రాయపర్తి మండలం రాగన్న గూడెం గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో తేనే టీగలు ఎర్రబెల్లిపై దాడి చేశాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాలకుర్తి నియోజక వర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ పోటీ చేస్తున్నారు. తన గెలుపు కోసం ప్రచారం చేస్తూ.. ఇతర పార్టీ అభ్యర్థల కోసం కూడా ఎర్రబెల్లి ప్రచారం నిర్వహించారు.












Click it and Unblock the Notifications