బ్రోకర్: రమేష్‌పై ఎర్రబెల్లి సంచలనం, బాబుకు అల్టిమేటం
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అల్టిమేటం జారీ చేశారు. అదే సమయంలో పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పైన నిప్పులు చెరిగారు.
సిఎం రమేష్ లాంటి దళారులు, వ్యాపారవేత్తలు, మోసగాళ్లకు చంద్రబాబు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చారని ఆగ్రహించారు. రమేష్ లాంటి వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వడం నష్టం చేస్తుందన్నారు. కనీసం వార్డు మెంబర్‌గా గెలవలేని రమేష్‌కు పార్టీ ఎంపి పదవి ఇచ్చిందన్నారు.

ఇప్పుడు ఆయన అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఓ బ్రోకర్, మోసగాడు అని ధ్వజమెత్తారు. రమేష్ పైన అధినేత వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సిఎం రమేష్ వల్ల పార్టీ భ్రష్టు పడుతోందని విమర్శించారు.
పార్టీలో రమేష్ లాంటి వారు ఉండాలో తాము ఉండాలో చంద్రబాబు తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. డబ్బు ఉందనే అహంకారంతోనే రమేష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. కాగా, తనకు కాంగ్రెసు పార్టీ నుండి ఆహ్వానం వస్తుందని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు సమైక్యవాదం వినిపిస్తున్న పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద్ పైన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications