బిజెపితో పొత్తు మాకు అవసరం: ఎర్రబెల్లి, కెసిఆర్‌పై ఫైర్
వరంగల్/ నల్లగొండ : తమ పార్టీతో పొత్తు బిజెపికి ఎంత అవసరమో, తమ పార్టీకి కూడా అంతే అవసరమని తెలుగదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరుగుతోందని అంటున్నారని, తెరాసను కాంగ్రెసులో విలీనం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ముందుకు రాకపోవడం వల్ల ఆలస్యం జరుగతోందని అంటున్నారని ఆయన అన్నారు.
తెలంగాణ కావాలో, రాజకీయాలు కావాలో కెసిఆర్ తేల్చుకోవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసులో తెరాస విలీనంపై కెసిఆర్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు, తెరాస మధ్య ఒప్పందం బెడిసికొట్టడం వల్లనే తెలంగాణ ఏర్పాటులో జాప్యం జరుగుతోందని ఆయన అన్నారు.

తెరాస అధిష్టానం కాంగ్రెసు అధిష్టానమేనని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ ఘనకార్యం చేశారని ఇండియా టుడే అవార్డు ఇచ్చిందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో పూర్తి స్థాయి చర్చ జరిగేలా పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు ఏకం కావాలని ఆయన సూచించారు.
విభజన విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అనైతికంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి నైతిక విలువలు ఉంటే తెలంగాణ విషయంలో సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. కిరణ్, చంద్రబాబు, జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్ర నేతల ఒత్తిడి మేరకే సభను వాయిదా వేశారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications