సోనియా కాళ్లు పట్టుకున్నారు: కెసిఆర్‌పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే తన కటుంబం రాజకీయాల్లో ఉండదని కెసిఆర్ చెప్పారని, ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాను ఎందుకు కలిశారని ఆయన అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ వియోజత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి పదవి కోసం కెసిఆర్ సోనియా కాళ్లు పట్టుకున్న మాట వాస్తవం కాదా అని ఆయన అడిగారు. రాజకీయ జెఎసి తరఫున అమరవీరుడు శ్రీకాంతాచారి కుటుంబానికి పాలకుర్తి టికెట్ ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. సీమాంధ్ర నేతలు ఒత్తిడి చేసినా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని స్పష్టం చేశారు.

కాగా, కెసిఆర్ రేపు హైదరాబాదు వస్తున్నారు. ఈ సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీకి తెరాస ఏర్పాట్లు చేసింది. కెసిఆర్ రేపు ఒంటి గంటా పది నిమిషాల సమయంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బేగంపేట చేరుకుంటారు.
బేగంపేటలో ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం చెబుతారు. ఆ తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక రథంలో విజయోత్సవ ర్యాలీ ముందుకు సాగుతుంది. దాని మీద ఆయన గన్ పార్కులోని అమరవీరుల స్థూపం చేరుకుంటారు. అమర వీరుల స్థూపంపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తారు.
కెసిఆర్ అక్కడి నుంచి తెరాస కార్యాలయానికి చేరుకుని, తెలంగాణ తల్లికి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకుంటారు. దీంతో రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంలో 13 చోట్ల వాహనాలను దారి మళ్లిస్తున్నారు.












Click it and Unblock the Notifications