జగన్‌కు 151 ఎలా వచ్చాయనుకున్నారు?!: గుట్టు విప్పిన అనిల్
YS Jagan: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి జగన్‌ను జైలుకు పంపించేలా కుట్ర పన్నిందంటూ ఆరోపిస్తోన్నారు.
దీనిపై తాజాగా షర్మిల భర్త, ప్రముఖ ఎవాంజలిస్ట్ బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టారు. జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆస్తుల కోసం జగన్ తన తల్లి, చెల్లినీ లెక్క చేయట్లేదంటూ మండిపడ్డారు. ఆస్తుల కోసం ఎందాకైనా వెళ్తాడని, వారిద్దరిపై పిటీషన్లు వేయడం దీనికి ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్టీపీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయాన్నీ వివరించారు. 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో పార్టీ పెట్టాలని, రాజకీయంగా ఎంతో లబ్ది కలుగుతుందని షర్మిలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచించారని, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయపడి జగన్ దీనికి నిరాకరించారని చెప్పారు.
తన ఆస్తులన్నీ హైదరాబాద్‌లోనే ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయని షర్మిలతో పార్టీ పెట్టించడానికి జగన్ అడ్డుకున్నారని బ్రదర్ అనిల్ కుమార్ చెప్పారు. తీరా ఆమె ధైర్యం చేసి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు సాక్షిలో అడ్వర్టయిజ్‌మెంట్ కూడా ఇవ్వడానికి జగన్ అంగీకరించలేదని విమర్శించారు.
ఈ విషయంలో స్వయంగా వైఎస్ విజయమ్మ జోక్యం చేసుకున్నారని, అడ్వర్టయిజ్‌మెంట్‌కు ఖర్చులు భరిస్తామని చెప్పినా ఒప్పుకోలేదని పేర్కొన్నారు. ఏపీలో అధికారంలోకి రావడానికి తమను అన్ని రకాలుగా వినియోగించుకన్నాడని, ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ తమను పక్కన పెట్టాడని మండిపడ్డారు.
151 నా వల్లె వచ్చింది.. ఇది 100% కరెక్ట్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా .... This guy played a vital role @ BG ✅#TDP #YSRCP #BJP #Janasena pic.twitter.com/nGa4CFGQfQ
— sivazee (@sivazeestudio) October 29, 2024
తమ అవసరం తీరిన తరువాత పక్కన పెట్టేశాడని, దగ్గరికి కూడా రానివ్వలేదని అనిల్ ఆరోపించారు. అప్పుడే జగన్ నిజ స్వరూపం బయటపడిందని చెప్పారు. జగన్ స్వార్థపరుడు అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదని, ఆ స్వార్థంతోనే ఇప్పుడు కుటుంబ సభ్యులపై పిటీషన్లు వేశారని అన్నారు.
2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు తన వల్లే వచ్చాయని బ్రదర్ అనిల్ అన్నారు. అది- తన నంబర్‌గా అభివర్ణించారు. తన మొబైల్, కారు నంబర్ అన్నీ కూడా 151తోనే ఉంటాయని వివరించారు. జీసస్ క్రైస్ట్ అని లెక్కబెడితే 151 అనే అంకెలు వస్తాయని, దేవుడు ఆ నంబర్‌ను తనకు మాత్రమే ఇచ్చాడని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో దేవుడి రాజ్యాన్ని నిర్మించడానికి తనకు అదృష్టంగా 151 సంఖ్య లభించిందని, అదే నంబర్‌తో 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అసెంబ్లీ సీట్లు లభించాయని గుర్తు చేశారు. తాను చేసిన ప్రార్థనలను దేవుడు ఆలకించడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ అని చెప్పారు.












Click it and Unblock the Notifications