లెక్కలన్నీ రాస్తున్నాం.. తిరిగి చెల్లిస్తాం: చంద్రబాబు
అందరి లెక్కలు రాస్తున్నామని, వేధింపులకు తిరిగి బదులు చెల్లిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితి పిచ్చోడిచేతిలో రాయిలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి పర్యటనలో ఉన్న చంద్రబాబు స్థానికంగా ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండగా ఉన్నారని కొనియాడారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల జగన్ రివర్స్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు.

డ్రైవింగ్ రానివారిని సీట్లో కూర్చోబెడితే బండిని వెనక్కి నడుపుతారని, ఛార్జీలు, పన్నులపేరుతో ప్రజలపై భారం మోపుతారని, ఇటువంటి దుర్మార్గపు పాలన రాష్ట్రంలో ఉందని, ఇది నశించాలని, రివర్స్ పాలన పోవాలని, ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలన్నారు.
ఉద్యోగులకైనా, పోలీసులకైనా సమస్యలు వస్తే ముందుగా మాట్లాడేది తెలుగుదేశం పార్టీయేనని, ఈ విషయాన్ని వారు గుర్తంచుకోవాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నా, ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications