చంద్రబాబు అరెస్టుతో కుప్పంలో హైఅలర్ట్, పోటాపోటీగా టీడీపీ, వైసీపీ నాయులు, టెన్షన్!
కుప్పం/తిరుపతి/విజయవాడ: స్కిల్ డెవలప్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకుదిగారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలకు తెరలేపారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడిని శనివారం వేకువ జామున నంద్యాలలో అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. నంద్యాలలో నారా చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు ఆయనకు వైద్యపరీక్షలు చేయించారు. తరువాత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు పిలుచుకుని వెళ్లారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయకుడు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చిన ఆయన సొంత నియోజక వర్గం కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పంతో పాటు ఆనియోజక వర్గంలో టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
కుప్పం మునిసిపాలిటిలో ఇప్పటికే వైఎస్ఆర్ సీపీ జెండా పాతడంతో, మునిసిపాలిటిలో అధికారంలోకి రావడంతో కుప్పం పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పంలో మొదటిసారి తెలుగుదేశం పార్టీని ఓడించిన వైసీపీ గత మునిసిపాలిటి ఎన్నికల్లో విజయం సాధించింది. కుప్పంలో పట్టుసాదించిన వైసీపీ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అయిన తరువాత కుప్పంలో నిరసనలు వ్యక్తం కాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కుప్పం పట్టణంతో పాటు కుప్పం అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే టీడీపీ నాయకులు, కారకర్తలను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. టీడీపీ నాయకులను అడ్డుకోవడానికి వైసీపీ నాయకులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఓ క్రిమినల్ ను, హంతకులను అరెస్టు చేసినట్లు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. ఓ పార్టీ అదినేత, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో పాల్గొన్న తరువాత రాత్రిపూట అరెస్టు చెయ్యడం ఏమిటని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications