'మర్యాద'తో కన్నాను పడేసిన చంద్రబాబు?
తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని కన్నా ప్రకటించగానే పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటిర రాజేంద్రప్రసాద్ ను కన్నా దగ్గరకు చంద్రబాబు పంపించారు.
మాజీ మంత్రి, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీపై, పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగేవారు. ఉమ్మడి రాష్ట్ర విభజనతో రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. ప్రత్యర్థులు మిత్రులయ్యారు.. మిత్రులు ప్రత్యర్థులయ్యారు. ఈ కోవలోనే చంద్రబాబుకు కన్నా లక్ష్మీనారాయణ ఆప్తుడయ్యారు.

సంతోషించిన కన్నా
తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని కన్నా ప్రకటించగానే పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటిర రాజేంద్రప్రసాద్ ను కన్నా దగ్గరకు చంద్రబాబు పంపించారు. పార్టీలోకి వస్తానన్నవారికి ఆహ్వానం పలకడంతోపాటు మిమ్మల్ని సాదరంగా స్వాగతిస్తున్నామంటూ చంద్రబాబు దూతగా ఆలపాటి రాజా కన్నాతో చర్చించారు. మీ లాంటి బలమైన సామాజికవర్గానికి చెందిన వ్యక్తి, రాష్ట్రమంతటా అనుచర గణం ఉన్న వ్యక్తి టీడీపీలోకి రావడమంటే సంతోషదాయకమన్నారు. దీనికి కన్నా లక్ష్మీనారాయణ ఎంతో సంతోషించినట్లు ఆయన అనుయాయులు చెబుతున్నారు.

కన్నా వల్ల కలిసిరానున్న కాపు
మర్యాద కోసం మాజీ మంత్రిని పంపించి మాట్లాడించడం, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం, గతాన్ని తవ్వుకోకుండా కలిసి పనిచేద్దామనే సంకేతాన్ని పంపించడంపై కన్నా ఖుషీ అయ్యారు. అంతేకాకుండా కన్నా చేరికను గుంటూరు జిల్లాలోని ఏ నాయకుడూ వ్యతిరేకించడంలేదు. గుంటూరు పశ్చిమ నుంచికానీ, సత్తెనపల్లి నుంచి కానీ, పెదకూరపాడు నుంచికానీ పోటీచేయడానికి అవకాశం ఉంది. పెదకూరపాడు నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన చరిత్ర కన్నాకు ఉంది. 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమకు మారారు. కన్నా లక్ష్మీనారాయణరాకవల్ల గుంటూరు జిల్లాలోని కాపు సామాజికవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీవైపు నిలబడే అవకాశం కనపడుతోంది.

శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేదానికి కన్నా టీడీపీలో చేరడమే నిదర్శనం. ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, చిన్న స్థాయి వ్యక్తి అయినా చంద్రబాబుకు గౌరవించడం మొదటినుంచి అలవాటు. సార్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. దీనివల్ల ఎంతోమంది ఖుషీ అయ్యేవారు. ఇప్పుడు కన్నా మాట్లాడినప్పుడు కూడా పార్టీ అధినేత హోదాలో ఉన్నప్పటికీ సార్ అనే పదాన్ని ఉపయోగించి కన్నాను పడేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనలోకి వెళ్లాలనుకున్నప్పటికీ ఆ పార్టీ బీజేపీతో పొత్తులో ఉండటంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకొని టీడీపీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కృతనిశ్చయంతో కన్నా ఉన్నారు.












Click it and Unblock the Notifications