జనసేనలోకి కడప, విశాఖ మాజీ మంత్రులు - టీడీపీని కాదని, ఏం జరుగుతోంది..!!
ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. వారాహి యాత్ర తరువాత పవన్ రాజకీయ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. విశాఖ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తాజాగా పవన్ ను కలిసి జనసేన లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కడప, విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు ఇద్దరు పవన్ తో కలిసి రాజకీయ ప్రయాణానికి సిద్దం అవుతున్నారు. ఆ ఇద్దరు టీడీపీకి అనుకూలంగా మారుతున్న సమయంలో అనూహ్యంగా నిర్ణయం మారింది.
జనసేనలోకి డీఎల్: కడప జిల్లా నుంచి చెందిన సీనియర్ నేత...మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జనసేనలో చేరటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ ను కలవాలని నిర్ణయించారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దతు ప్రకటించిన డీఎల్ కొంత కాలంగా సీఎం జగన్ లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డీఎల్ టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది.

తాను త్వరలోనే ఒక ప్రధాన పార్టీలో చేరుతానని డీఎల్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కడప జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల్లో డీఎల్ జనసేన వైపు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మైదుకూరు నుంచి ఆరు సార్లు డీఎల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి గా పని చేసారు. డీఎల్ తొలి నుంచి ఆసక్తిగా ఉన్న టీడీపీని కాదని ఇప్పుడు జనసేన వైపు చూస్తుండటం జిల్లాలో ఆసక్తి కరంగా మారుతోంది.
పవన్ ను కలవనున్న కొణతాల: విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం పని చేసారు. ఇప్పుడు జనసేన లోకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ తో సమావేశం కానున్నారు. వైఎస్ కేబినెట్ లో కొణతాల మంత్రిగా పని చేసారు.

1989, 1991 లో అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచిన కొణతాల, 1994లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. వైఎస్ మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో జగన్ కు అండగా నిలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖ పార్లమెంటు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆయన సోదరుడు రఘునాధ్ ఎమ్మెల్యేగా పోటీ చేసారు. 2014లో విజయమ్మ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మారుతున్న సమీకరణాలు: వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో ఆ పార్టీకి దూరమయ్యారు, ఉత్తరాంధ్ర సమస్యల పైన పోరాటానికి సిద్దమయ్యారు. మధ్యలో చంద్రబాబుకు దగ్గర అవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ నేతలు పవన్ తో కలిసి రాజకీయంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించటం ఆసక్తి కర పరిణామంగా మారుతోంది. పవన్ టీడీపీతో పొత్తు ఖాయమని భావిస్తున్న సమయంలో అటు బీజేపీ పవన్ కేంద్రంగా రాజకీయం ప్రారంభించింది. ఇటు జనసేన వైపు సీనియర్ల చూపు మళ్లింది. దీంతో..ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications