జనసేనలోకి 'ఆమంచి'?
పర్చూరు వైసీపీ ఇన్ ఛార్జిగా ఇటీవలే కృష్ణమోహన్ బాధ్యతలు నిర్వహించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జనసేన పార్టీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడి ఫోటోఉండటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ జనసేన శ్రేణులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫొటోతోపాటు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు ఫొటో కూడా ఉంది.

ఫ్లెక్సీలో స్వాములు ఫొటో
ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు సోదరుడే కాకుండా అన్ని వ్యవహారాలు తానై నడిపించేవాడు. కృష్ణమోహన్ పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలో శ్రీనివాసరావు ఫొటో ఉండటం ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే సోదరుడు జనసేనకు దగ్గరవుతున్నారనే చర్చ ప్రారంభమైంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమంచి
2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసిన ఆమంచి కృష్ణ మోహన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాత్రం నవోదయం పార్టీ నుంచి పోటీచేసి విజయం సాధించారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి దగ్గరై చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరి చీరాల అభ్యర్థిగా పోటీచేశారు. తెలుగుదేశం పార్టీ నేత కరణం బలరాం చేతిలో ఓడిపోయారు.

పర్చూరు ఇన్ ఛార్జిగా బాధ్యతల స్వీకరణ
బలరాం గెలుపు తర్వాత చీరాల రాజకీయం మారింది. ఎమ్మెల్యే కరణం అనూహ్యంగా వైసీపీకి దగ్గరవడంతో ఆమంచికి చీరాలలో ప్రాధాన్యతను తగ్గించారు. అంతేకాకుండా కరణం బలరాం వర్గంతో విభేదాలు కూడా ఉన్నాయి. కొంతకాలంగా ఆమంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధిష్టానం చీరాలపై దృష్టిసారించి ఆ నియోజకవర్గాన్ని కరణం బలరాంకు అప్పగించింది. పర్చూరు నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ ను నియమించింది.












Click it and Unblock the Notifications