టీడీపీకి రాయపాటి షాక్- వైసీపీలోకి ఎంట్రీ, కన్నాపై పోటీ..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రానున్న ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ అన్నట్లుగా మారాయి. ఈ సమయంలో పార్టీ సీనియర్ నేత షాక్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు టీడీపీ వీడే యోచనలో ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సమయం నుంచి రాయపాటి అసౌకర్యంగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నుంచి సీటు హామీతో పార్టీ మార్పుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది.
వైసీపీ వైపు రాయపాటి : గుంటూరు జిల్లా సీనియర్ పొలిటీషియన్ రాయపాటి వైసీపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ లో గుంటూరు ఎంపీగా నాలుగు సార్లు గెలిచిన రాయపాటి 2014 రాష్ట్ర విభజన సమయంలో టీడీపీలో చేరారు. నర్సరావు పేట నుంచి పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలోనే తన కుమారుడుకు సత్తెనపల్లి సీటు ఆశించారు.

కానీ, దక్కలేదు. వయోభారంతో రాయపాటి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. 2019లో నర్సరావుపేటలో గెలిచే అవకాశం లేదని రాయపాటికి పార్టీకి స్పష్టం చేసినా..అధినేత ఒత్తిడితో పోటీ చేయాల్సి వచ్చిందని రాయపాటి వర్గం చెబుతోంది. తాజాగా పార్టీలో కన్నా కు ప్రాధాన్యత ఇస్తూ తమను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ నేతలతో మంతనాలు : టీడీపీ కన్నా లక్ష్మీనారాయణకు సత్తెన పల్లి సీటు ఖరారు చేసింది. తాము ఆశిస్తున్న సీటులో తమతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా కన్నాకు కట్టబెట్టడం ఏంటనేది రాయపాటి వర్గం ప్రశ్న. కొత్త నాయకులు రాగానే ,సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నాయకత్వం పైన రాయపాటి ఆగ్రహం గా ఉన్నారని గుర్తించిన వైసీపీ నేతలు తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు విశ్వస నీయ సమాచారం.
రాయపాటి శిష్యుడిగా రాజకీయ ప్రవేశం చేసి..మంత్రిగా పని చేసిన నేత చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అవకాశం ఇస్తే సత్తెనపల్లి నుంచి కన్నా పైన పోటీ చేసేందుకు రాయపాటి వర్గం సిద్దమవుతోందని వైసీపీకి సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.

సమస్యగా మారుతున్న సత్తెనపల్లి : ఇప్పటికే సత్తెనపల్లిలో టీడీపీకి కోడెల శివరాం సమస్యగా మారారు. కన్నాకు సీటు ఖరారు చేయటం పైన ఆగ్రహంతో ఉన్నారు. సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అదే నియోజకవర్గం పైన రాయపాటి కుటుంబం ఆశలు పెట్టుకుంది. వైసీపీలో చేరితే సీటు ఖాయమైతే మారేందుకు సిద్దమనే సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.
ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనే వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేస్తారని చెబుతున్నారు. దీంతో, మధ్యే మార్గంగా రాయపాటి కుటుంబానికి మరో సీటు వైసీపీ ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాయపాటి భవిష్యత్ నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications