చంద్రబాబు కంట్లో నలుసులా రాయపాటి?
తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా పార్టీ అధినేత చంద్రబాబుకు కంట్లో నలుసులా తయారయ్యారు. ఒక్కో నాయకుడిది ఒక్కో రకం. వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయినవారికి టికెట్ లేదని, వయోభారంతో ఉన్నవారిని వచ్చే ఎన్నికల్లో పక్కనపెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గుంటూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున, నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాయపాటి సాంబశివరావు పరోక్షంగా చంద్రబాబును బెదిరిస్తున్నారు.
వీల్ చైర్ లో వచ్చిన రాయపాటి
మీడియాతో మాట్లాడటానికి రాయపాటిని వీల్ చైర్ లో తీసుకురావాల్సి వచ్చింది. ఈయన నేరుగా చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తన కుటుంబానికి రెండు టికెట్లతోపాటు తాడికొండ నుంచి తాను చెప్పినవారికి టికెట్ ఇవ్వాలంటూ రెండు నెలల క్రితం ఒకసారి పార్టీ అధిష్టానాన్ని బెదిరించారు. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన రాయపాటి టికెట్ల పంచాయితీ పెట్టారు. చంద్రబాబు చెబితే నరసరావుపేట నుంచి పోటీచేస్తానని, గతంలో డబ్బుల్లేక ఓడిపోయానని చెప్పారు.

రెండు టికెట్లు కావాలంటున్నారు
నరసరావుపేట నుంచి పోటీకి దిగుతానని, తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. అంతేకాకుండా తన కుటుంబంలో కుమారుడు రంగబాబుకు సత్తెనపల్లి లేదంటే పెదకూరపాడు నుంచి టికెట్ ఇవ్వాలని, అలాగే తన సోదరుడు కూతురు, అమరావతి జేఏసీ నాయకురాలైన రాయపాటి శైలజకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పిల్లలిద్దరికీ టికెట్లిస్తే తనకు ఇవ్వకపోయినా పర్వాలేదని అధిష్టానానికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.
పనులు ప్రారంభించిన మహేష్ యాదవ్
నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో స్థానికులకే కేటాయించాలని కొత్త మెలిక పెట్టారు. ఆ విషయాన్ని నేరుగా మీడియా ముందు కక్కేశారు. రాబోయే ఎన్నికల్లో నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ కు ఇవ్వాలని చంద్రబాబు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఈమేరకు పుట్టా కుటుంబానికి సంకేతం అందడంతో వారు క్షేత్ర స్థాయిలో పనులు మొదలు పెట్టారు.

తాజాగా రాయపాటి సాంబశివరావు లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ తేవడంతో అది వైసీపీకి ప్రయోజనం కలిగిస్తుందని పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవలే పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను చూసి సాంబశివరావు ఎంతో నేర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని చంద్రబాబు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications