టీటీడీ ఈ-డిప్: ఏ రోజు ఎంతమందికి దర్శనం, ఏర్పాట్లు ఇలా
ప్రఖ్యాత పుణక్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో మార్పు లేదు. తాకిడి కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వేలాదిమంది శ్రీవారిని దర్శించుకుంటోన్నారు. సోమవారం నాడు 70,345 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,292 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.43 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఎనిమిది కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి టీటీడీ ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ల ద్వారా టికెట్లను పొందిన భక్తుల వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 1,76,000 మంది భక్తులు తొలి మూడు రోజుల పాటు స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు వారికి మెసేజ్ లు కూడా అందాయి. టీటీడీ పంపించిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా టోకెన్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
డిసెంబర్ 30 అంటే వైకుంఠ ఏకాదశి రోజున 57,000, ద్వాదశి నాడు 64,000, కొత్త సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని జనవరి 1 రోజున 55,000 మంది భక్తులకు దర్శన అవకాశం లభించింది. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు వీటి రిజిస్ట్రేషన్లు ఆరంభమైన విషయం తెలిసిందే. టికెట్ల కోసం గడువు ముగిసే సమయానికి మొత్తం 24,05, 237 రిజిస్ట్రేషన్లు టీటీడీకి అందాయి. టీటీడీ వెబ్ సైట్- 9,28,608, యాప్- 13,29,112, వాట్సాప్ గవర్నెన్స్- 1,45,517 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
వీరిలో 1.76 వేల మందికి మాత్రమే అవకాశం లభించింది. ఒక టికెట్ పై నలుగురు అంటే 1+3 (సెల్ఫ్ + ముగ్గురు కుటుంబ సభ్యులు) ప్రాతిపదికన శ్రీవారిని దర్శించుకోవచ్చు. వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడు రోజులు.. డిసెంబర్ 30, 31, జనవరి 1 నాడు వాళ్లు శ్రీవారిని దర్శించుకుంటారు. జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు రూ.300 దర్శన టిక్కెట్లు- 15,000, శ్రీవాణి దర్శన టికెట్లు- 1,000 రెగ్యూలర్ పద్ధతిలో టీటీడీ మంజూరు చేయనుంది.
డిసెంబర్ 5వ తేదీన శ్రీవాణి టికెట్లను జారీ చేయనుంది టీటీడీ. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 టోకెన్లు మంజూరు అవుతాయి. ఆ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు ఇప్పటికే రద్దయ్యాయి.












Click it and Unblock the Notifications