వివాహేతర సంబంధం: యువకుడు అదృశ్యం, కొట్టి చంపేశారా?
కడప: జిల్లాలోని రాజంపేట పట్టణంకు చెందిన ఓ యువకుడు వారం రోజులుగా కనిపించకుండా పోవడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, అతని అదృశ్యానికి వివాహేతర సంబంధమే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు(19) వారంరోజులుగా కనిపించకుండా పోవడంతో రాజంపేట అర్బన్ పీఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. మండలంలోని పాపరాచపల్లెకు చెందిన సాయిప్రకాశ్‌రాజు తన తల్లితండ్రులతో కలిసి పట్టణంలోని విద్యుతనగర్‌లో ఉంటున్నారు. ఇతని అదృశ్యం వెనుక వివాహేతర సంబంధంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సాయి స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. గత శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయిన సాయి వారంరోజులుగా రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే తన బిడ్డ అదృశ్యమైయ్యాడని తండ్రి చంద్రరాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో ఆరా తీశారు.

ఆ యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం రావడంతో పట్టణంలో సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఓ వివాహితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అప్పుడప్పుడు ఆమెతో గొడవపడి కొట్టేవాడనే వాదనలు వెలుగులోకి వచ్చాయి. కాగా, ఈమె భర్త జీవోనపాధికై గల్ఫ్‌దేశానికి వెళ్లాడని సమాచారం.
మరొకరితో వివాహేతర సంబంధం..: సాయిని చంపేశారా?
సాయిప్రకాశ్‌రాజు సంబంధం పెట్టుకున్న మహిళ కడపకు చెందిన మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణమే వీరిద్దరికి మధ్య గొడవలు మొదలైనట్లు పలువురు చెప్పుకుంటున్నారు. ఈ యువకుడు ఆమె ఇంటిలోకి వెళ్లగానే అక్కడ కడపకు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు, తర్వాత వారి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం.
ఆ సమయంలో సాయిపై దాడి చేయగా మృతి చెందినట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి. పోలీసు విచారణలో ఉన్న వివాహిత కూడా ఇదే విధంగా వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. అసలు సాయి ఉన్నాడా? లేక హత్య చేసిన శవాన్ని మాయం చేశారా? అన్న అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications