వినాయక చవితి నాడు తీవ్రవిషాదం.. తామర పూల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు !
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు సైతం ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంటున్నారు. సర్వత్రా ఆనందోత్సవాలతో మార్మోగుతున్న వేళ ఏపీలోని బాపట్ల జిల్లాలో మాత్రం ఊహించని విషాదం అందరినీ కలచివేస్తుంది. గణపతి పూజ కోసం తామర పూలు తేవాలనుకున్న ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపుతోంది.
తామర పూల కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..
పూండ్ల గ్రామానికి చెందిన సైకం నాగభూషణం (17), సుద్దపల్లి శ్రీమంత్ (15).. వినాయకుడికి పూలు సమర్పించాలని చెరువులోకి దిగారు. కానీ అక్కడ నీరు లోతుగా ఉండటంతో వారు తిరిగి బయటకు రాలేకపోయారు. క్షణాల్లోనే మునిగిపోతూ ప్రాణాలు విడిచారు.

దీంతో వినాయకుడికి పూలు తెచ్చి ఇల్లు ఆనందంగా అలంకరించాలి అనుకున్న ఆ ఇద్దరు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ఒకేసారి ఇద్దరు చిన్నారులు మరణించడంతో గ్రామమంతా దుఃఖ వాతావరణంలో మునిగిపోయింది. పండుగ పాటలు, మంత్రాల మోతలు వినిపించాల్సిన చోట విషాదంతో రోదనలు మార్మోగుతున్నాయి.
కాగా నాగభూషణం ఇంటర్ చదువుతుండగా.. శ్రీమంత్ 9వ తరగతి చదువుతున్నాడు. వినాయక చవితి రోజు దేవుడిని ఆరాధించి సంతోషించాల్సిన పరిస్థితుల్లో పిల్లలు మృతదేహాలుగా రావడం చూసి ప్రతి ఒక్కరూ తట్టుకోలేకపోతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు.












Click it and Unblock the Notifications